
Viveka Murder Case: అప్రూవర్‌గా డ్రైవర్ దస్తగిరి!
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ
వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి
కడప, ఈటీవీ : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారనున్నారు. నిందితుడు దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్నారని... విచారణకు సహకారం అందిస్తున్న కారణంగా అతని సాక్ష్యాన్ని నమోదు చేయాలని సీబీఐ అధికారులు కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి అక్టోబరు 26న పులివెందుల కోర్టులో సీబీఐ ప్రాథమిక ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిని నిందితులుగా చేర్చింది. ఛార్జిషీట్ వేయడానికి ముందే, అంటే అక్టోబరు 22న దస్తగిరి కడప కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు. అదే రోజు సీబీఐ.. కడప సబ్ కోర్టులో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది. షేక్ దస్తగిరి సీఆర్పీసీ 306 సెక్షన్ కింద అప్రూవర్‌గా మారుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. వివేకా హత్య కేసులో దస్తగిరితో పాటు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు దస్తగిరి సీబీఐకి, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. కేసు పురోగతి విషయంలో సహకరించడానికి దస్తగిరి సిద్ధంగా ఉన్నాడని కోర్టుకు సీబీఐ తెలిపింది. హత్యకు సంబంధించిన అన్ని విషయాలు దస్తగిరికి తెలుసని వెల్లడించింది. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే అతని సాక్ష్యం నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై మిగతా ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరి నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు చూసిన తర్వాతే కౌంటర్ వేస్తామని తెలిపారు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ పత్రాలను ఇవ్వాలని సీబీఐకి సూచిస్తూ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.