Viveka Murder Case: శివశంకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండు

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. ఈనెల 17న ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సీబీఐ

Updated : 19 Nov 2021 13:51 IST

కోర్టులో శివశంకర్‌రెడ్డిని కలిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి

శివశంకర్‌రెడ్డిని కలిసేందుకు వస్తున్న ఎంపీ అవినాష్‌రెడ్డి

కడప, ఈటీవీ, న్యూస్‌టుడే, పులివెందుల : మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి పులివెందుల కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. ఈనెల 17న ఆయనను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సీబీఐ అధికారులు... గురువారం ఉదయం కడపకు తీసుకొచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు, పలువురు వైకాపా నాయకులు అక్కడికి వచ్చారు. కడప నుంచి పులివెందులకు పటిష్ఠ బందోబస్తు మధ్య శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకు పులివెందుల కోర్టులో హాజరుపరచగా... మేజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండు విధించారు. సాయంత్రం 4.50 గంటలకు అతన్ని కడప కేంద్ర కారాగారానికి తరలించారు. శివశంకర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పులివెందుల కోర్టులో ఉన్న సమయంలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి వచ్చి అతన్ని పలకరించారు. కోర్టు ప్రాంగణంలోనే అరగంటకు పైగా ఉన్నారు. అలాగే దంతలూరి కృష్ణ అలియాస్‌ మంగలి కృష్ణ, మున్సిపల్‌ ఛైర్మన్‌ వరప్రసాద్‌, వై.ఎస్‌.మధు, పలువురు నాయకులు కూడా శివశంకర్‌రెడ్డిని కోర్టులో కలిశారు. వర్షం పడుతున్నా భారీ సంఖ్యలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కోర్టు వద్దకు చేరుకున్నారు. శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు వాహనంలో రిమాండుకు తరలించే క్రమంలో కొందరు కార్యకర్తలు, అభిమానులు కోర్టు బయట వాహనానికి అడ్డు తగిలారు. పోలీసులు వారందరినీ పక్కకు తప్పించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి కోర్టు వద్దకు రావడం చర్చనీయాంశమైంది.


వివేకా హత్యతో సంబంధం లేదు
సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసిన శివశంకర్‌రెడ్డి

వైద్యపరీక్షల అనంతరం కడప ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శివశంకర్‌రెడ్డిని బయటకు తీసుకొస్తున్న సీబీఐ సిబ్బంది

ఈనాడు,అమరావతి, ఈటీవీ,కడప: వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని ఈ కేసులో తాజాగా అరెస్టైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రెండు రోజుల కిందట సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. తాను నిర్దోషినని... ఉద్దేశపూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టు కాకముందు రాసిన ఈ లేఖను ఆయన ప్రతినిధులు గురువారం మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్‌ 2019 మార్చిలో తనను విచారించి తీవ్రంగా హింసించిందని పేర్కొన్నారు.

‘‘ఈ కేసును సీబీఐకి అప్పగించిన తర్వాత ఇప్పటివరకూ నన్ను మూడుసార్లు విచారించారు. విచారణకు పూర్తిగా సహకరించి నాకు తెలిసిన విషయాలన్నింటినీ చెప్పాను. వివేకా కుమార్తె సునీత దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె ఇష్టాఇష్టాల ప్రకారం అమాయకులైన వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ నిందలు మోపారు. వివేకా హత్య ఘటనలో దాగి ఉన్న వ్యక్తులను బయటకు తీయాలి. వారు చాలా క్రూరులు. నిజాల్ని వెలికి తీయాలి. దర్యాప్తు సక్రమంగా, సజావుగా జరగకపోతే హంతకులు తప్పించుకుని అమాయకులు బలి అవుతారు...’’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని