Road Accident: 120 కి.మీ.స్పీడ్‌తో చెట్టును ఢీకొన్న కారు..ముగ్గురు అన్నదమ్ముల మృతి

మితిమీరిన వాహన వేగం అన్నదమ్ముల అను‘బంధాన్ని’ అంతమొందించింది. ఏ కార్యక్రమానికైనా కలసికట్టుగా వెళ్లే వారిని రోడ్డు ప్రమాదం ఒకేసారి

Updated : 27 Nov 2021 11:11 IST

డ్రైవర్‌ కూడా..

మేనమామ దశదిన కర్మకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌ - న్యూస్‌టుడే, మానకొండూర్‌: మితిమీరిన వాహన వేగం అన్నదమ్ముల అను‘బంధాన్ని’ అంతమొందించింది. ఏ కార్యక్రమానికైనా కలసికట్టుగా వెళ్లే వారిని రోడ్డు ప్రమాదం ఒకేసారి కబళించింది. కరీంనగర్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములతోపాటు డ్రైవర్‌ మృత్యువాతపడ్డారు. మానకొండూర్‌ సీఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో నివాసముంటున్న పంచాయతీరాజ్‌ ఈఈ కొప్పుల శ్రీనివాస్‌రావు(58), ఆయన తమ్ముళ్లు బాలాజీ శ్రీధర్‌(న్యాయవాది)-(55), (శ్రీరాజ్‌(ప్రైవేటు ఇంజినీర్‌)- (53), వారి బావ పెంచాల సుధాకర్‌రావు(64) కారులో గురువారం ఉదయం కరీంనగర్‌ నుంచి ఖమ్మం జిల్లా కల్లూరులో మేనమామ లక్కినేని సత్యం దశదినకర్మకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటల సమయంలో కరీంనగర్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మానకొండూర్‌ ఠాణాకు 100 మీటర్ల దూరంలో కారు అదుపు తప్పి రోడ్డుకు కుడివైపున ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ జలంధర్‌(28), ముందు సీట్లో కూర్చుని ఉన్న శ్రీనివాస్‌రావు, వెనకాల ఉన్న బాలాజీ శ్రీధర్‌, శ్రీరాజ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. వెనకాల కూర్చుని ఉన్న సుధాకర్‌రావుకు తీవ్రగాయాలవడంతో 108 వాహనంలో కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 120 కి.మీకుపైగా ఉన్నట్లు మీటర్‌ రీడింగ్‌లో నమోదైంది. రెండు ఎయిర్‌ బెలూన్లు తెరుచుకున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. ఉదయం 6 గంటల సమయంలో ఆ మార్గంలో కాలినడకన వెళ్తున్న స్థానికులు ‘108’కి సమాచారం ఇచ్చేవరకూ క్షతగాత్రుడు కారులోనే కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ ఆప్యాయంగా మెలిగే అన్నదమ్ములు ఒకేసారి తనువు చాలించిన తీరు చూపరుల్ని కంటతడిపెట్టించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని