ఫేస్‌బుక్‌ లైవ్‌లో అన్నదాత ఆత్మహత్య

వ్యవసాయం కలిసిరాక.. చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక.. ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరీ ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం

Updated : 27 Nov 2021 05:37 IST

అప్పుల బాధతో ఘోరం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: వ్యవసాయం కలిసిరాక.. చేసిన అప్పులు తీర్చే దారి కనిపించక.. ఫేస్‌బుక్‌ లైవ్‌ పెట్టి మరీ ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరు సమీపంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పొన్నలూరు మండలం పెరికపాలెంకు చెందిన కుంకు వెంకటేశ్వర్లు(38)కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. గ్రామంలో 4 ఎకరాల భూమి, పొగాకు బ్యారన్‌ ఉంది. మరికొంత భూమి కౌలుకు తీసుకున్నారు. నష్టాలు రావడంతో మూడేళ్ల క్రితం కుటుంబంతో కలిసి బళ్లారి ప్రాంతానికి వెళ్లారు. అక్కడ 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని అంజూర తోటలు సాగు చేశారు. లాక్‌డౌన్‌ విధించడం, ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో ఏడాది క్రితం అత్తగారి గ్రామమైన పొన్నలూరు మండలంలోని చెరుకూరు వచ్చారు. అక్కడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నారు. 6 నెలల క్రితం పొగాకు బ్యారన్‌ విక్రయించి కొంత అప్పు తీర్చారు. ఇంకా రూ.30 లక్షల వరకు అప్పులున్నట్టు సమాచారం. ఈ నెల 25న పొలానికి వెళ్లిన వెంకటేశ్వర్లు సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ లైవ్‌ సెల్ఫీ వీడియో ఆన్‌ చేసి పురుగు మందు తాగారు. వ్యవసాయం చేసి నష్టపోయి, అప్పులోళ్ల ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు. బంధువులు కందుకూరులోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని