
Crime News: ధరణినే బురిడీ కొట్టించి.. నకిలీ పాసుపుస్తకంతో భూమి విక్రయానికి యత్నం
మిడ్జిల్, న్యూస్‌టుడే: ధరణిలో తప్పుడు వివరాలు నమోదు చేసి.. నకిలీ పట్టాదారు పాసుపుస్తకం సృష్టించి ఏకంగా రూ.1.50 కోట్ల విలువైన భూమిని విక్రయించేందుకు యత్నించిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు, భూయజమాని తెలిపిన వివరాల మేరకు.. జడ్చర్ల పట్టణం బాదేపల్లికి చెందిన రైతు మహ్మద్ జావీద్ 2013లో మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారు సర్వే నంబరు 46లో 2.01 ఎకరాల భూమి కొన్నారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకం కోసం ఆన్లైన్లో పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా నమోదు కాలేదు. తహసీల్దార్ శ్రీనివాసులు సూచన మేరకు కలెక్టరేట్లోని ధరణి సెక్షన్లో సంప్రదించగా.. మీసేవ కేంద్రంలో మరోసారి ఆధార్‌కార్డు ఇచ్చి, వేలిముద్ర వేయాలని సూచించారు. ఈనెల 25న జడ్చర్లలోని మీసేవ కేంద్రానికి జావీద్ వెళ్లగా.. అప్పటికే ఆ భూమి మహబూబ్‌నగర్‌కు చెందిన జావీద్ పేరిట ఉన్నట్లు ఆన్లైన్లో చూపించింది. ఆన్లైన్లో అతని ఆధార్ కార్డు.., జిరాక్స్ కాపీలో తండ్రి పేరు మార్చేసి ఉన్నాయి. ఈక్రమంలో మహబూబ్‌నగర్‌కు చెందిన సాదత్ అలీతో విక్రయ ఒప్పందం చేసుకుని.. భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తనకు జరిగిన మోసాన్ని గుర్తించిన జడ్చర్లకు చెందిన జావీద్ పోలీసులను ఆశ్రయించడంతో శనివారం మధ్యాహ్నం నకిలీ పత్రాలతో తహసీల్దారు కార్యాలయానికి వచ్చిన నిందితుడు జావీద్‌ను పోలీసులు పట్టుకున్నారు. అతనికి సహకరించిన ఎజాజ్ అలి అన్సారి, సయ్యద్ అబ్దుల్ ఖలీల్, మహ్మద్ ఇనాయత్ అలి అన్సారీలపై మోసం కేసు నమోదు చేశామని మిడ్జిల్ ఎస్సై జయప్రసాద్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.