Crime News: భర్త చేతిలో గ్రామసచివాలయ పోలీసు దారుణ హత్య

అనుమానంతో ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి.. సచివాలయ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్‌ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం..

Updated : 01 Dec 2021 06:50 IST

డోన్‌ గ్రామీణం, డోన్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: అనుమానంతో ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి.. సచివాలయ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్న భార్యపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా డోన్‌ మండలంలో మంగళవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. డోన్‌ కొత్తపేట ప్రాంతానికి చెందిన సలీంద్ర చౌడప్ప, లక్ష్మిదేవిల కుమార్తె బాలలక్ష్మీదేవి(30)కి, వెల్దుర్తి మండలం గువ్వలకుంట్లకు చెందిన బంగి సుధాకర్‌కు ఏడాది కిందట వివాహమైంది. ఆమె డోన్‌ మండలం వెంకటనాయునిపల్లె గ్రామసచివాలయంలో మహిళా పోలీసుగా పని చేస్తున్నారు. సుధాకర్‌ నంద్యాలలో వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్యపై అనుమానంతో వేధించేవాడు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ చేసినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆమె డోన్‌ పోలీసుస్టేషన్‌లో కొన్ని నెలల క్రితం అతడిపై ఫిర్యాదు చేసింది. దీన్ని మనసులో ఉంచుకున్న సుధాకర్‌ ఆమెపై గతంలో రెండుసార్లు దాడికి యత్నించాడు. ఈ పరిణామంతో వారు విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఆమె విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై మరో ఉద్యోగితో కలసి డోన్‌కు వస్తుండగా గ్రామ సమీపంలో దారికాచి ఆమెపై కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అడ్డుకోబోయిన ఉద్యోగిపై కత్తితో బెదిరించి పరారయ్యాడు. రక్తపుమడుగులో లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సుధాకర్‌ నంద్యాలలో విధులు నిర్వహించే సమయంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారనే ఫిర్యాదులున్నాయని మృతురాలి బంధువులు పేర్కొన్నారు. పోషకాహారం పంపిణీ చేస్తూ తోటి సిబ్బందితో 3గంటల ప్రాంతంలో ఫొటోలు దిగిన లక్ష్మీదేవి గంటలోనే దారుణ హత్యకు గురికావటంపై తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని