చెడ్డీ గ్యాంగ్‌ కలకలం

విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో బుధవారం రాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఐదుగురితో కూడిన ముఠా కర్రలు, రాడ్లతో ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడింది. ఒకరి వెంట ఒకరు మూడో ఫ్లోరుకు చేరుకొని ఓ గృహం తలుపును పగులగొట్టేందుకు ప్రయత్నించారు.

Updated : 03 Dec 2021 06:22 IST

కర్రలు, రాడ్లతో అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశం
తలుపు పగులగొడుతుండగా అలికిడికి ఇంట్లోవారు లేవడంతో పరార్‌

మెట్ల మార్గంలో మొదటి ఫ్లోరుకు చేరుకుంటున్న చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు (సీసీ కెమెరా దృశ్యం)

ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో బుధవారం రాత్రి చెడ్డీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ఐదుగురితో కూడిన ముఠా కర్రలు, రాడ్లతో ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడింది. ఒకరి వెంట ఒకరు మూడో ఫ్లోరుకు చేరుకొని ఓ గృహం తలుపును పగులగొట్టేందుకు ప్రయత్నించారు. ఆ శబ్దానికి మెలకువరావడంతో ఇంట్లో నివాసముంటున్న జి.రవికిరణ్‌, కుటుంబ సభ్యులు కేకలు వేశారు. అదే సమయంలో పక్క ఇంట్లో వారు కూడా కేకలు వేయడం, కాపలా వ్యక్తి దీపాలు వేసి అలారం మోగించడంతో అపార్ట్‌మెంట్‌ వాసులంతా నిద్రలేచి బయటకు వచ్చారు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీధర్‌కుమార్‌, నేరవిభాగం ఎస్‌ఐ శ్రీనివాసరావులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులను అప్రమత్తం చేశారు. దుండగులు అపార్ట్‌మెంట్‌ ప్రహరీకి ఉన్న సోలారు విద్యుత్తు తీగలను కత్తిరించి దిమ్మె పైనుంచి లోపలకు ప్రవేశించినట్లు గుర్తించిన క్లూస్‌టీం సభ్యులు వేలిముద్రలు సేకరించారు. గ్రామానికి చివర, సంపన్నులు నివాసముండే అపార్ట్‌మెంట్లను ఎంపిక చేసుకుని ప్రణాళికతోనే ఈ నేరానికి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

దర్యాప్తు చేస్తున్నాం: సీఐ శ్రీధర్‌ కుమార్‌

గురువారం పోలీసుస్టేషన్‌లో సీఐ శ్రీధర్‌ కుమార్‌ విలేకర్లతో మాట్లాడుతూ నేరానికి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులా? చిల్లర దొంగలు ఇలా ముసుగులో వచ్చారా? అనే విషయం దర్యాప్తులో తెలుస్తుందన్నారు. క్లూస్‌ విభాగం సేకరించిన వేలి ముద్రలను గతంలో చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు చేసిన నేర ప్రదేశంలో సేకరించిన వాటితో సరిపోలుస్తున్నట్లు వివరించారు. కొత్తవారు, అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామస్థులు, అపార్ట్‌మెంట్‌ వాసులకు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని