నర్సింగ్‌ విద్యార్థినితో అసభ్య ప్రవర్తన

శిక్షణలో ఉన్న నర్సింగ్‌ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడిచేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Updated : 03 Dec 2021 13:44 IST

ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడి
నిందితుడిపై సస్పెన్షన్‌ వేటు

వైద్యుడిపై దాడిచేస్తున్న బాధితురాలి బంధువులు

నారాయణఖేడ్‌, న్యూస్‌టుడే: శిక్షణలో ఉన్న నర్సింగ్‌ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై దాడిచేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో జరిగింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ కమిషనర్‌ స్పందించి.. సూపరింటెండెంట్‌ డా.నర్సింగ్‌చౌహాన్‌ను సస్పెండ్‌ చేస్తూ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కల్హేర్‌ మండలం గిరిజన తండాకు చెందిన యువతి(24) ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రిలో శిక్షణ పొందుతోంది. బుధవారం ఆమె విధులు ముగించుకుని వెళుతుండగా సూపరింటెండెంట్‌ పిలిచి.. తొందరగా ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించారు. బస్సు టైమ్‌ అవుతోందని యువతి తెలపగా గదిలోకి పిలిపించుకుని ఆమె వ్యక్తిగత విషయాలు అడుగుతూ అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలి కుటుంబీకులు ఆరోపించారు. గురువారం వారు నారాయణఖేడ్‌కు వచ్చి.. ఓ షాపింగ్‌మాల్‌ వద్దకు నర్సింగ్‌చౌహాన్‌ను పిలిపించారు. వారి మధ్య వాగ్వాదం జరగడంతో నర్సింగ్‌చౌహాన్‌ను ఆసుపత్రి ఆవరణలోకి తీసుకువచ్చి దాడిచేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సూపరింటెండెంట్‌పై, ఆయన ఫిర్యాదు మేరకు బాధితురాలితో పాటు ఆమె కుటుంబీకులు, బంధువులపై కేసులు నమోదు చేసినట్లు నారాయణఖేడ్‌ ఎస్సై వెంకట్‌రెడ్డి చెప్పారు. శిక్షణలో ఉన్న నర్సింగ్‌ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందున సస్పెండ్‌ చేసినట్లు వైద్యవిధాన కమిషనర్‌ పేర్కొన్నారు.   ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయన్నారు. శుక్రవారం ఖేడ్‌ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.సంగారెడ్డిని ఆదేశించారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని