Crime News: ఉత్తుత్తి ఇంటర్వ్యూలు.. నియామకాలు

పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ.1.29 కోట్లు కాజేసిన ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం అరెస్టు చేశారు. వీరినుంచి రూ.8.85 లక్షల నగదు, నకిలీ నియామక

Updated : 05 Dec 2021 08:55 IST

 పంచాయతీరాజ్‌లో కొలువులంటూ ఘరానా మోసం

  మాజీ సూపరింటెండెంట్‌ సహా ముగ్గురి అరెస్టు

నిందితులు వీరమణి, రాజ్‌కుమార్‌, పాండు

ఈనాడు-హైదరాబాద్‌, న్యూస్‌టుడే-రెజిమెంటల్‌బజార్‌: పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసి రూ.1.29 కోట్లు కాజేసిన ముగ్గురు నిందితులను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు శనివారం అరెస్టు చేశారు. వీరినుంచి రూ.8.85 లక్షల నగదు, నకిలీ నియామక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వరరావు తెలిపారు. ములుగు జిల్లా పంచాయతీరాజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రాజ్‌కుమార్‌ ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని, తాండూరుకు చెందిన వీరమణి, కారు డ్రైవర్‌ చిచేంటి పాండులు సహకరించారని చెప్పారు. ఇప్పటివరకూ 25 మంది సొమ్ములిచ్చి మోసపోయారని వివరించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన అరండకర్‌ రాజ్‌కుమార్‌ ములుగులో పంచాయతీరాజ్‌శాఖ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగాల పేరిట మోసం చేసి డబ్బు సంపాదిద్దామని నిర్ణయించుకున్నాడు. తాండూరు, బడంగ్‌పేటలో ఉంటున్న తన అనుచరులు వీరమణి, పాండులకు రాజ్‌కుమార్‌ ఏడాది కిందట తన పథకం వివరించగా.. సరేనన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జాబ్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న వ్యక్తితో పాండు పరిచయం పెంచుకున్నాడు. అక్కడికి వస్తున్న నిరుద్యోగులతో పాండు, వీరమణిలు మాట్లాడి ఉద్యోగాలిప్పిస్తామని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. విద్యార్హత పత్రాలు తీసుకుని వారిని ములుగుకు తీసుకెళ్లి రాజ్‌కుమార్‌తో మాట్లాడించేవారు. ముగ్గురు కలిసి మోసం చేశారని గుర్తించిన బాధితులు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులు రాజ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

ఎర్రమంజిల్‌ కార్యాలయంలో...

ఉద్యోగం నుంచి తొలగించడంతో రాజ్‌కుమార్‌ నిరుద్యోగులను నమ్మించేందుకు ఉత్తుత్తి ఇంటర్వ్యూలు, నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో ఆర్నెల్ల కిందట హైదరాబాద్‌కు మకాం మార్చాడు. వీరమణి, పాండులు బాధితులతో మాట్లాడి రూ.లక్షలు వసూలు చేస్తుండగా.. రాజ్‌కుమార్‌ అయిదారుగురిని తీసుకుని ఎర్రమంజిల్‌లోని పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చేవాడు. సందర్శకులు కూర్చునే చోట నకిలీ అధికారితో ఇంటర్వ్యూ చేయించేవాడు. అనంతరం నకిలీ నియామక పత్రాలు ఇచ్చేవాడు. వీటిని తీసుకున్న బాధితులు నల్గొండ, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లా పంచాయితీరాజ్‌శాఖల కార్యాలయాలకు వెళ్లగా.. ఇవి బోగస్‌ పత్రాలని అధికారులు తెలిపారు. బాధితుల్లో ఇద్దరు పంజాగుట్ట, మీర్‌పేట ఠాణాల్లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని