Crime News: పెళ్లింట.. పెను విషాదం

పది కి.మీ దూరం.. పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వారు మృత్యువాత పడటం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 9 గంటల

Updated : 06 Dec 2021 08:52 IST

కారు, ఆర్టీసీ బస్సు ఢీ
ఇద్దరు చిన్నారులు, డ్రైవరు మృత్యువాత  
మరో ముగ్గురికి తీవ్రగాయాలు

కోరుట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: పది కి.మీ దూరం.. పది నిమిషాల్లో ఇంటికి చేరాల్సిన వారు మృత్యువాత పడటం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట గ్రామ శివారు జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో అతివేగంగా వస్తున్న కారు.. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు, కారు డ్రైవరు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జావిద్‌ బావమరిది జిబ్రామ్‌ వివాహం ఈనెల 28న ఉండటంతో దుస్తులు కొనేందుకు కుటుంబ సభ్యులతో కలసి నాలుగురోజుల కిందట హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ షాపింగ్‌ చేశారు. కోరుట్లకు చెందిన కారు హైదరాబాద్‌ నుంచి ఖాళీగా తిరిగి వెళ్తోందని తెలుసుకున్న జావీద్‌, తన భార్య, ముగ్గురు కుమారులతో కలిసి అందులో ఆదివారం ఉదయం తిరుగుప్రయాణం అయ్యారు. ఈక్రమంలో మోహన్‌రావుపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు.. జగిత్యాలకు వెళ్తున్న మెట్‌పల్లి డిపో ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. కారు నుజ్జునుజ్జయింది. డ్రైవరు షాజీద్‌అలీ(34) సీటులో ఇరుక్కుని చనిపోయారు. కారులో ఉన్న జావీద్‌ చిన్న కుమారుడు అజాన్‌(5) అక్కడికక్కడే మరణించగా.. రెండో కుమారుడు అషార్‌(9) జగిత్యాల ఆసుపత్రిలో కన్నుమూశాడు. తీవ్రగాయాలైన జావీద్‌(40), ఈయన భార్య సమయ అమ్రీన్‌(35), వారి పెద్ద కుమారుడు అనాష్‌(12)లను కరీంనగర్‌లో ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు మృతదేహాన్ని తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సంఘటన స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి పరిశీలించగా సీఐ శ్రీను తదితరులు సహాయక చర్యలు చేపట్టారు.

 

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని