అనుమానాస్పద స్థితిలో రిమాండ్‌ ఖైదీ మృతి

రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసులే తన భర్తను కొట్టి చంపారని అతడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు

Published : 08 Dec 2021 04:59 IST

పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యుల ఆరోపణ

భానుచందర్‌

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మంగళవారం విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసులే తన భర్తను కొట్టి చంపారని అతడి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయవాడ పాతబస్తీ చిట్టినగర్‌ ప్రాంతానికి చెందిన భానుచందర్‌ (35) ట్రావెల్స్‌ వ్యాపారం చేస్తున్నారు. ఆయన కారులో వస్తుండగా ఆదివారం సాయంత్రం ఎ.కొండూరులో తెలంగాణ మద్యంతో పోలీసులకు పట్టుబడ్డారు. భానుచందర్‌ను అరెస్టు చేసి.. రిమాండ్‌ విధించి నూజివీడు సబ్‌జైలుకు తరలించారు. మంగళవారం ఆయన అనారోగ్యానికి గురయ్యారని, పోలీసులు నూజివీడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని, విజయవాడ జీజీహెచ్‌కు తరలించాలని అక్కడి వైద్యులు సూచించారు. అతడిని జీజీహెచ్‌కు మంగళవారం మధ్యాహ్నం 2:30కు తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. భానుచందర్‌కు మధుమేహం ఉందని, జైల్లో మాత్రలు ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు అయ్యాయని, విజయవాడకు తీసుకువస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారని పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న భానుచందర్‌ భార్య కల్యాణి, కుటుంబ సభ్యులు జీజీహెచ్‌కు వచ్చారు. తన భర్తకు అనారోగ్యం ఏమీ లేదని, పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. భానుచందర్‌ అధికార వైకాపాకు మద్దతుదారు కావడంతో నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు జీజీహెచ్‌కు వచ్చారు. ఇది పోలీసుల హత్యేనని, పోస్టుమార్టం నిర్వహించడానికి వీళ్లేదని అడ్డుకున్నారు. అంతకుముందు మృతదేహాన్ని స్వాధీనం చేసే విషయంలో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము సంతకం చేయబోమని బంధువులు స్పష్టం చేశారు. దీంతో డ్యూటీ ఉన్న కానిస్టేబుల్‌తో సంతకం చేయించుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీలో సిబ్బంది భద్రపరిచారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని