Crime News: నిజామాబాద్‌లో ఘాతుకం.. నిద్రిస్తున్న ముగ్గురి దారుణ హత్య

పగలంతా కష్టించి రాత్రి వేళ ఆదమరచి నిద్రపోతున్న ముగ్గురు అమాయకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకొంది. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఓ హార్వెస్టర్‌ మరమ్మతుల షెడ్డులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకొన్న

Updated : 10 Aug 2022 12:17 IST

దోపిడీ దొంగల పనిగా అనుమానం

నిజామాబాద్‌ నేరవార్తలు, డిచ్‌పల్లి, న్యూస్‌టుడే: పగలంతా కష్టించి రాత్రి వేళ ఆదమరచి నిద్రపోతున్న ముగ్గురు అమాయకులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన ఘటన నిజామాబాద్‌లో చోటు చేసుకొంది. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఓ హార్వెస్టర్‌ మరమ్మతుల షెడ్డులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకొన్న ఈ ఘాతుకం బుధవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ కథనం ప్రకారం.. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన హర్పాల్‌ సింగ్‌(33) డిచ్‌పల్లిలో హార్వెస్టర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు పరిచయం ఉన్న జోగిందర్‌ సింగ్‌(40) వారం కిందట పంజాబ్‌ నుంచి ఓ హార్వెస్టర్‌ను ఇక్కడికి తీసుకొచ్చి హర్పల్‌ సింగ్‌తో కలిసి ఉంటున్నారు. క్రేన్‌ ఆపరేటర్‌గా పనిచేసే జహీరాబాద్‌కు చెందిన బానోత్‌ సునీల్‌(24) అప్పుడప్పుడు వీరి షెడ్డు వద్ద నిద్రిస్తుంటారు. ఈ ముగ్గురు మంగళవారం అర్ధరాత్రి షెడ్డులో నిద్రిస్తున్న సమయంలో వారి తలలపై  నిందితులు బలమైన ఆయుధం (సుత్తిగా అనుమానం)తో దాడి చేశారు. దీంతో ముగ్గురూ నిద్రిస్తున్న చోటే మరణించారు.
బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత షెడ్డులో పని నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి మృతదేహాలు చూసి డిచ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. హత్యకు గురైన వారి మొబైల్‌ ఫోన్లతో పాటు కొంత నగదు అపహరణకు గురైంది. దీంతో దోపిడీకి వచ్చిన దొంగలు ముగ్గురినీ హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పక్కనే జాతీయ రహదారి ఉండటంతో ఇతర రాష్ట్రాల ముఠాల పని కావొచ్చని అనుమానిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని