ATM: ఏటీఎం ట్యాంపరింగ్‌.. రూ.70 లక్షలు చోరీ

ఏటీఎంలలో ట్యాంపరింగ్‌ ద్వారా రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులు పోలీసులకు చిక్కారు. పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులు, రెండు

Updated : 10 Dec 2021 13:24 IST

తిరుపతిలో ఇద్దరి అరెస్టు

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఏటీఎం కార్డులు, ఫోన్లు, నగదు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ఏటీఎంలలో ట్యాంపరింగ్‌ ద్వారా రూ.70 లక్షలు కాజేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులు పోలీసులకు చిక్కారు. పలు బ్యాంకులకు చెందిన 99 ఏటీఎం కార్డులు, రెండు చరవాణులు, రూ.20వేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. డీపీవో కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు నిందితులను ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు. తిరుపతి రామానుజం కూడలిలోని ఎస్‌బీఐ ఏటీఎంలోకి ఇద్దరు వచ్చి ట్యాంపరింగ్‌ చేసి నగదు కాజేసినట్లు బ్యాంకు మేనేజరు రమేష్‌ కుమార్‌ ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీసీటీవీ ఫుటేజీలు అందించారు. తిరుపతి తూర్పు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండులోని ఎస్‌బీఐ ఏటీఎం దగ్గరున్న నిందితుల్ని సీఐ శివప్రసాద్‌ రెడ్డి, ఎస్సై ప్రకాష్‌కుమార్‌ అదుపులోకి తీసుకుని విచారించారు. హరియాణా రాష్ట్రం నుహ్‌జిల్లా పిప్రోలి గ్రామానికి చెందిన ఆరిఫ్‌ఖాన్‌ (25), సలీంఖాన్‌గా (25) వారిని గుర్తించారు. అక్టోబరు నుంచి ఇప్పటి వరకు తిరుపతిలోని తూర్పు, పడమర పీఎస్‌లు, ఎస్వీయూ, తిరుచానూరు పోలీస్‌స్టేషన్లలో నమోదైన ఆరు కేసుల్లో వీరు నిందితులు. వీరికి సహకరించిన నకీబ్‌ హుస్సేన్‌, ఇలియాస్‌, హక్ముదీన్‌ పరారీలో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని