Road Accident: కారుణ్యం చూపని విధి..ముగ్గురి దుర్మరణం

కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొంది కుటుంబాలను పోషిస్తున్న ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు 

Published : 10 Dec 2021 08:08 IST

మృతుల్లో ఇద్దరు కారుణ్య నియామక ఉద్యోగులు

ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న మద్యం సీసా

పాలమూరు, దేవరకద్ర, న్యూస్‌టుడే: కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొంది కుటుంబాలను పోషిస్తున్న ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఎంపీడీఓ కార్యాలయంలో విధులు ముగించుకుని వారు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో వారు మరణించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కూడా కన్నుమూశారు.

కారులోని యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహబూబ్‌నగర్‌ గ్రామీణ ఠాణా ఎస్సై రమేశ్‌ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం 6.15 గంటల సమయంలో మహబూబ్‌నగర్‌ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న కారు.. మహబూబ్‌నగర్‌ మండలం అప్పాయిపల్లి సమీపంలో ముందున్న వాహనాన్ని దాటడానికి యత్నించి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ గౌని చంద్రశేఖర్‌రెడ్డి (35)తోపాటు విజయరాణి (38) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన జ్యోతి (48), ఖాజా మైనొద్దీన్‌, శ్రీలత, సుజాతలను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందారు. ప్రమాదంలో మృతి చెందిన విజయరాణి దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్‌ కాగా, జ్యోతి జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. గాయపడిన ఖాజా మైనొద్దీన్‌, శ్రీలత కూడా అదే కార్యాలయ ఉద్యోగులే. ఆటోడ్రైవర్‌ నారాయణపేట జిల్లా గోటూరుకు చెందినవారు కాగా మహబూబ్‌నగర్‌లో నివాసముంటారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన కారులో మద్యం సీసాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. వారు మరికల్‌ మండలం వెంకటాపూర్‌కు చెందినవారని తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ప్రమాదంలో మృతి చెందిన జ్యోతి,  విజయరాణి, చంద్రశేఖర్‌రెడ్డి

విధుల్లో చేరిన అయిదు రోజుల్లోనే..

ప్రమాదంలో మృతి చెందిన జ్యోతి, విజయరాణిలిద్దరు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొంది దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్నారు. విజయరాణి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, గత ఏప్రిల్‌లో మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమెకు అటెండర్‌గా ఉద్యోగం రాగా అయిదు రోజుల కిందటే విధుల్లో చేరారు. ఆమెకు ఇద్దరు పిల్లలు..కుమారుడు ఇంటర్‌ ప్రథమ, కుమార్తె 9వ తరగతి చదువుతున్నారు. జ్యోతి భర్త ఉపాధ్యాయుడు కాగా పదేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. కారుణ్య నియామకం పొందిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేయడానికి సంబంధాలు చూస్తున్న సమయంలో తల్లి మృతి చెందడంతో ఆ కుటుంబానికే పెద్ద దిక్కు లేకుండా పోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని