Crime News: పోలీసు కస్టడీలో నోరు విప్పని శిల్పాచౌదరి

పెట్టుబడుల ముసుగులో రూ.కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి ఒకరోజు పోలీసు కస్టడీ ముగిసింది. మంగళవారం పోలీసులు శిల్పాచౌదరిని...

Updated : 15 Dec 2021 06:54 IST

ఈనాడు, హైదరాబాద్‌ - నార్సింగి, న్యూస్‌టుడే: పెట్టుబడుల ముసుగులో రూ.కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరి ఒకరోజు పోలీసు కస్టడీ ముగిసింది. మంగళవారం పోలీసులు శిల్పాచౌదరిని నార్సింగి ఎస్‌వోటీ(స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్స్‌) కార్యాలయంలో ప్రశ్నించారు. అనంతరం కోకాపేట్‌లోని బ్యాంకు లాకర్‌ను ఆమె సమక్షంలోనే తెరిచారు. కీలక వివరాలు లభిస్తాయని భావించిన పోలీసులకు అక్కడా చుక్కెదురైంది. శిల్పాచౌదరి దంపతులు కొనుగోలు చేసిన విల్లా, హయత్‌నగర్‌లోని భూమి పత్రాలు లభించినట్టు సమాచారం. ఆ రెండింటినీ అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో అప్పులు తీర్చుతానంటూ పదేపదే పోలీసులతో వాదనకు దిగినట్టు తెలుస్తోంది. రూ.32 కోట్లు అప్పుగా తీసుకున్నట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించట్లేదు. కస్టడీ గడువు ముగియటంతో బుధవారం ఉదయం ఆమెను ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు. 

ఇంతకీ ఆ నగదు ఎక్కడ?

గండిపేట్‌ సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి హంగూ ఆర్భాటంతో పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేశారు. పెట్టుబడుల కోసం కిట్టీపార్టీల్లో పరిచయమైన మహిళల నుంచి రూ.1-6కోట్ల వరకూ అప్పుగా తీసుకున్నారు. ఆ సొమ్ము తిరిగిఇవ్వమంటూ సదరు మహిళలు ఆమెపై ఒత్తిడి పెంచారు. వారి నుంచి తప్పించుకునేందుకు బౌన్సర్లతో బెదిరించాల్సి వచ్చిందంటూ పోలీసుల విచారణలో శిల్ప అంగీకరించారు. కస్టడీలో ఎటువంటి ఆధారాలు లభించకపోవటం, లాకర్లలోనూ పత్రాలు లేకపోవటం వంటి వాటితో ఇదంతా ఆమె పక్కా పథకం ప్రకారమే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లాకర్‌లో లభించిన ఆసుపత్రి సొసైటీ పత్రాలతో ఆధారాల సేకరణకు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని