గృహిణి అల్లిన చోరీ కథ..పోలీసులను పరుగులు పెట్టించింది..

ప్రభుత్వ అధికారి భార్య జరగని దొంగతనాన్ని జరిగినట్లు అల్లిన కథతో పోలీసులు సంఘటనా స్థలికి పరుగులు తీశారు. సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ గుంటూరు నుంచి క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు...

Updated : 24 Dec 2021 08:29 IST

ఇంట్లో చెల్లా చెదురుగా పడేసిన దుస్తులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ అధికారి భార్య జరగని దొంగతనాన్ని జరిగినట్లు అల్లిన కథతో పోలీసులు సంఘటనా స్థలికి పరుగులు తీశారు. సీఐ సాంబశివరావు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ గుంటూరు నుంచి క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నేరం ఆనవాళ్లు లేకపోవడంతో ఆమెను గుచ్చి గుచ్చి అడగ్గా అసలు దొంగతనమే జరగలేదని తేలింది. పోలీసుల కథనం ప్రకారం... కుంచనపల్లిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని ఫ్లాట్‌లో గుంటూరు డ్వామా కార్యాలయంలో పనిచేసే అధికారి ఉంటున్నారు. ఆయన గురువారం ఉదయం పనిపై బయటకు వెళ్లారు. భార్య ఇంట్లో పని చేసుకుంటోంది. ఫ్ల్లాట్‌లోకి ప్రవేశించి ఆమె ముఖంపై మత్తుమందు చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం ఇద్దరు దుండగులు పడకగదుల్లోకి ప్రవేశించి ఆయా గదుల్లోని కప్‌బోర్డులలో దుస్తులు లాగేసి మంచంపై పడేశారు. ఓ గదిలో రెండు బీరువాల తలుపులు తెరిచి ఉండడంతో అందులోంచి 30 తులాల బంగారు నగలు, రూ.3వేలు ఎత్తుకెళ్లారు. కొద్దిసేపటికి భర్త ఇంటికి వచ్చారు. అప్పటికి తేరుకున్న గృహిణి విషయాన్ని తన భర్తకు వివరించింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజీలు చూశారు. ఎక్కడా చోరీ జరిగిన ఆనవాళ్లు కనబడలేదు. చివరికి గృహిణి వేలిముద్రలతో సరిపోల్చగా ఆమెవేనని తేలడంతో అవాక్కై విచారించారు. అదంతా కట్టుకథగా తేలింది. ఆమెకు మతిస్థిమితం లేకపోవడంతోనే ఇలా వ్యవహరించినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని