Crime News: కరోనా చికిత్స ఇప్పిస్తామంటూ తీసుకెళ్లి.. బాలికతో వ్యభిచారం

తల్లి ప్రేమకు దూరమైన బాలికను ఆదుకుంటామని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఆమె జీవితంతో చెలగాటమాడిన ముఠాలోని 21 మందిని గుంటూరు పోలీసులు అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 26 Dec 2021 07:16 IST

 బెదిరించి వ్యభిచారం చేయించిన దుర్మార్గులు

కొవిడ్‌ మందు ఇప్పిస్తానని తీసుకెళ్లి నిలువునా మోసం

రెండు రాష్ట్రాల్లో 21 మంది నిందితుల అరెస్టు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: తల్లి ప్రేమకు దూరమైన బాలికను ఆదుకుంటామని తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఆమె జీవితంతో చెలగాటమాడిన ముఠాలోని 21 మందిని గుంటూరు పోలీసులు అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రధాన నిందితురాలు ఓ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. శనివారం గుంటూరులో నిందితుల వివరాలను అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ వెల్లడించారు. ‘గుంటూరు జిల్లా మేడికొండూరు మండలానికి చెందిన బాలికకు (13) జూన్‌ 26న కొవిడ్‌ రావడంతో పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చారు. బాలిక ద్వారా తల్లికీ కొవిడ్‌ సోకడంతో ఆమె గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ చనిపోయారు. ఈ క్రమంలో గుంటూరు ద్వారకానగర్‌కు చెందిన స్వర్ణకుమారి వారికి పరిచయమైంది. బాలికకు కరోనా నాటు మందు ఇప్పిస్తానని తండ్రిని నమ్మించి తీసుకెళ్లింది. స్థానిక చైతన్యపురిలో ఆమెను నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయించింది. తన కుమార్తె కోసం తండ్రి ఫోన్‌ చేసినప్పుడల్లా కొవిడ్‌ చికిత్స ఇప్పిస్తున్నానంటూ నమ్మించేది. అలా స్వర్ణకుమారి విజయవాడ, హైదరాబాద్‌, నెల్లూరులలోని తనకు తెలిసిన వారికి బాలికను అప్పగించి అక్కడ వ్యభిచారం చేయించింది. ఒకచోటు నుంచి మరోచోటుకు తీసుకెళ్లేప్పుడు బాధితురాలి కళ్లకు గంతలు కట్టేవారు. ఈ క్రమంలో బాలిక నెల్లూరులో తప్పించుకుంది. అదే సమయంలో స్వర్ణకుమారి తెలివిగా తన వద్ద ఉన్న బాలిక కనిపించకుండా పోయిందని గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నెల్లూరులో తప్పించుకున్న బాధితురాలు విజయవాడ బస్టాండ్‌కు రాగానే మరో వ్యభిచార నిర్వాహకురాలు నాగలక్ష్మి గుర్తించి మీ ఇంటికి తీసుకెళతానంటూ తణుకులోని మరో నిర్వాహకురాలు శారదకు విక్రయించింది. శారద బాలికను అశ్విని వద్దకు పంపింది. అశ్విని విజయవాడకు చెందిన మాజీ మహిళా హోంగార్డు జెసింత, ఆమె కూతురు హేమలతలకు బాలికను రూ.40వేలకు విక్రయించింది. వీరిద్దరూ వ్యభిచారం చేయించగా బాలిక అనారోగ్యానికి గురైంది. దీంతో బాగా చదివిస్తామంటూ బాధితురాలని నమ్మించారు. ఆమె చదువుతున్న సత్తెనపల్లిలోని పాఠశాలకు వెళ్లి... టీసీ ఇవ్వాలని అడిగారు. పాఠశాల నిర్వాహకులు బాలిక తండ్రి వస్తేనే ఇస్తామనడంతో... కారు డ్రైవరును తండ్రిగా చూపించే విఫలయత్నం చేశారు. దీంతో బాలిక తండ్రి వద్దకు వెళ్లి తాము మహిళామిత్ర వాళ్లమని, బాలికను పునరావాస కేంద్రంలో చేర్పిస్తామని, తాము చెప్పినట్లు వినకుంటే పోలీసు కేసు పెడతామని బెదిరించారు. దాంతో ఆయన వచ్చి టీసీ ఇప్పించారు. తర్వాత బాలికను విజయవాడ తీసుకెళ్లి మళ్లీ వ్యభిచారం చేయించారు. ఈ క్రమంలో ఆమె తప్పించుకొని తండ్రి వద్దకు వచ్చి తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని రోదించింది. వెంటనే ఆయన మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ కేసును అరండల్‌పేటకు బదిలీ చేయించి పశ్చిమ డీఎస్పీ సుప్రజను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. ఏఎస్పీ గంగాధరం పర్యవేక్షణలో నాలుగు బృందాలతో దర్యాప్తు చేయించారు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలతోపాటు హైదరాబాద్‌ యూసఫ్‌గూడకు చెందిన 21 మందిని అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ, కిడ్నాప్‌, మానవ అక్రమ రవాణా తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని