
Crime News: నాడు ప్రేమించాడు.. నేడు ఉరి బిగించాడు
వరకట్నం డబ్బులు తేలేదని భార్యను కడతేర్చిన భర్త
మెట్‌పల్లి, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి కట్నం అడుగుతాడని అనుకుంటామా? ఆ డబ్బు ఇవ్వలేదని ఏకంగా భార్యను చంపేస్తాడని ఊహిస్తామా? కానీ అదే జరిగింది. అంతే కాదు..ఆమే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సీఐ శ్రీను, ఎస్సై సదాకర్‌ల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌కు చెందిన కిషోర్ (32) కుటుంబం కొంతకాలంగా మెట్‌పల్లిలో ఉంటోంది. తమ గ్రామానికి చెందిన నిషిత అలియాస్ హన్విత(28)ను కిషోర్ ప్రేమించాడు. 2018లో పెద్దల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. వరకట్నంగా రూ.2 లక్షలు ఇస్తామని ఒప్పుకొన్న హన్విత తల్లిదండ్రులు వివాహ సమయంలో రూ.లక్ష నగదు, లాంఛనాలు ఇచ్చారు. మిగతా రూ.లక్ష తెమ్మని ఇటీవల భార్యను కొట్టి వేధించాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. తన చావుకు ఎవరూ కారణం కాదని భార్యతో రాయించుకున్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద మనుషులు ఈ నెల 21న ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. సోమవారం రాత్రి పదినెలల కూతురును తన తల్లిదండ్రుల ఇంట్లో పడుకోబెట్టాడు. మంగళవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్య మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు. తర్వాత అదే గదిలో కొక్కేనికి భార్య మృతదేహాన్ని వేలాడదీశాడు. తన భార్య ఉరి వేసుకొని చనిపోయిందని చిత్రీకరించడానికి మరుసటిరోజు ప్రయత్నించాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కిషోర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు.