TS News:జిల్లా మారింది.. గుండె ఆగింది!

పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

Updated : 31 Dec 2021 06:46 IST

బదిలీ ఆవేదనతో గుండెపోటుకు గురై ప్రధానోపాధ్యాయుడి మృతి

బానోతు జేత్రాం

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే; ఈనాడు, హైదరాబాద్‌: పనిచేస్తున్న జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ కావడంతో తీవ్ర మనోవేదనతో గుండెపోటుకు గురై ఓ ప్రధానోపాధ్యాయుడు మరణించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన బానోతు జేత్రాం(57) నెల్లికుదురు మండలం చిన్నముప్పారం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

ఉద్యోగుల జిల్లా కేటాయింపుల్లో ఆయనను ములుగు జిల్లాలోని ఓ పాఠశాలకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆయన అంత దూరం ఎలా వెళ్లాలని మథనపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇంట్లో గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో గృహంలో ఎవరూ లేరు. ఇంటికి వచ్చి తలుపు తీసి చూసేసరికి జేత్రాం మరణించి ఉన్నారని ఆయన భార్య జ్యోతి, కుమారుడు బాలగోపాల్‌ విలపిస్తూ తెలిపారు.

జిల్లాల కేటాయింపు విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరితోనే జేత్రాం మృతి చెందారని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.మల్లారెడ్డి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్‌ ఆరోపించారు.

ప్రధానోపాధ్యాయుడు జైత్రాం మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) డిమాండ్‌ చేసింది. గిరిజన ఉపాధ్యాయుల దామాషాను సక్రమంగా పాటించకుండా, కేడర్‌ సీనియారిటీ ప్రకారం ఆయన్ను జూనియర్‌గా నిర్ణయించి ములుగు జిల్లాకు కేటాయించారని నేతలు ఆరోపించారు. భార్యాభర్తల విభాగంలోనైనా తనకు న్యాయం చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో మానసిక క్షోభతో గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారని కమిటీ నేత చావ రవి తెలిపారు. యూఎస్‌పీసీ అత్యవసర సమావేశంలో జైత్రాం మృతికి సంతాపం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని