
Crime News:లైంగికదాడి ఆరోపణలపై శ్రీరామానంద ప్రభు అరెస్టు
నిందితుడు సాయిధామం ఆశ్రమ పీఠాధిపతి
విద్యార్థిని ఫిర్యాదుతో నల్గొండ జైలుకు తరలింపు
భువనగిరి నేరవిభాగం, బొమ్మలరామారం, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండల పరిధి సాయిధామం ఆశ్రమ(శ్రీసాయి దత్త) పీఠాధిపతి శ్రీరామానంద ప్రభుని అరెస్టు చేసి నల్గొండ జైలుకు తరలించినట్లు భువనగిరి ఏసీపీ సాయిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయనపై పోక్సో చట్టంతో పాటు, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీసులు, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. 17 ఏళ్ల క్రితం ఒక రోజు వయస్సున్న ఆడశిశువు నల్గొండ జిల్లాకేంద్రంలో లభ్యం కావడంతో అప్పట్లో అధికారులు నల్గొండ శిశువిహార్‌కు తరలించారు. అనంతరం 2004లో పెద్దపర్వతాపురంలోని సాయిధామ ఆశ్రమంలో చేర్చారు. ఆ బాలిక 2018 వరకు అక్కడే పదో తరగతి వరకు చదివింది. రెండేళ్ల క్రితం సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను హైదరాబాద్ అమీర్‌పేటలోని స్టేట్ హోంలో చేర్చారు. ఈ నేపథ్యంలో తాను ఆశ్రమంలో ఉండగా 2016లో ఒకసారి, 2018లో మరోసారి తనపై లైంగికదాడి చేశారని ఆరోపిస్తూ ఆమె గురువారం ఉదయం బొమ్మలరామారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి నిందితుణ్ని ఆశ్రమంలో అదుపులోకి తీసుకొన్న పోలీసులు శుక్రవారం భువనగిరి జిల్లా న్యాయస్థానానికి తీసుకొచ్చారు. నిందితుడికి జనవరి 12 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తరువాత ఆయన్ను అక్కడి నుంచి నల్గొండ జైలుకు తరలించారు.
ఆశ్రమ పీఠాధిపతి శ్రీరామానందను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని నిరసిస్తూ సాయిధామంలోని ఉచిత పాఠశాల, సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలను మూసివేశారు. పీఠాధిపతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు జరపలేమని నిర్వాహకులు తెలిపారు.