Cyber Crime:కూర్చుని సంపాదించమంటూ.. కొంప ముంచారు

‘దురాశ దుఃఖానికి చేటు’ అని తెలిసినా ఆన్‌లైన్‌ మోసాలకు నిత్యం ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. ‘మా యాప్‌లో నమోదు చేసుకోండి.. పెట్టుబడి పెట్టండి.. రోజూ ఊరికే కూర్చుని ఆదాయం పొందండి’

Published : 03 Jan 2022 08:49 IST

రూ. లక్షల్లో నష్టపోయిన జనం

రామన్నపేట, న్యూస్‌టుడే: ‘దురాశ దుఃఖానికి చేటు’ అని తెలిసినా ఆన్‌లైన్‌ మోసాలకు నిత్యం ఎంతోమంది మోసపోతూనే ఉన్నారు. ‘మా యాప్‌లో నమోదు చేసుకోండి.. పెట్టుబడి పెట్టండి.. రోజూ ఊరికే కూర్చుని ఆదాయం పొందండి’ అంటూ ఆశ చూపడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని పలువురు యువత ఓ బిజినెస్‌ యాప్‌లో డబ్బులుపెట్టి మోసపోయారు. కొన్ని నెలల క్రితం ఒక యాప్‌ వచ్చింది. ఇందులో రూ. 2,000 చెల్లించి సభ్యులుగా చేరితే రోజుకు 600, రూ.15,000  చెల్లించిన వారికి రోజుకు 2,900, రూ.25,000 చెల్లించిన వారికి రూ.5,000కు పైగా నగదు చొప్పున ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో చాలామంది సభ్యులుగా చేరారు. కొందరు వేలల్లో పెట్టుబడి పెట్టారు. రోజూ నగదు జమ అవుతుండటంతో ఒకరి నుంచి మరొకరికి విస్తృతంగా ప్రచారమైంది. రామన్నపేట, జనంపల్లి, లక్ష్మాపురం తదితర గ్రామాల్లో పెద్ద సంఖ్యలో యువకులు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టారు. డిసెంబరు 28 నుంచి ఆ యాప్‌ మాయమైంది. మూడు రోజులుగా ఖాతాలో నగదు జమ కాకపోవటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పలు గ్రామాల్లో వందలమంది ఈ యాప్‌లో సభ్యులుగా చేరినట్లు తెలుస్తోంది. జనంపల్లి గ్రామంలోనే రూ.20 లక్షలకు పైగా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై స్థానిక సీఐ చింతా మోతీరాంను వివరణ కోరగా, బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని