Crime News:కోడల్ని కడతేర్చిన మామ

ప్రేమించినవాడి కోసం ఆమె కనిపెంచిన తల్లిదండ్రులను ఎదిరించింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఆశల సంసారంలో అడుగిడింది. కొన్నాళ్లకే భర్త అర్ధాంతరంగా దూరం కావడంతో ఆమె జీవితం అగమ్యగోచరమైంది. కష్టకాలంలో ఆదరించాల్సిన

Updated : 04 Jan 2022 08:03 IST

 కుమారుడిని దూరం చేసిందనే కక్షతోనే

విషాదాంతమైన ప్రేమ కథ

సౌందర్య

కోటపల్లి, న్యూస్‌టుడే: ప్రేమించినవాడి కోసం ఆమె కనిపెంచిన తల్లిదండ్రులను ఎదిరించింది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై ఆశల సంసారంలో అడుగిడింది. కొన్నాళ్లకే భర్త అర్ధాంతరంగా దూరం కావడంతో ఆమె జీవితం అగమ్యగోచరమైంది. కష్టకాలంలో ఆదరించాల్సిన అత్తింటివారు.. కొడుకును తమకు దూరం చేసిందనే కక్షతో కోడలిని నిర్దయగా కడతేర్చారు. ఈ పైశాచిక ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి బొర్రగళ్ల లక్ష్మయ్య,  బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌందర్య(22) అదే గ్రామానికి చెందిన రాళ్లబండి సాయికృష్ణ ఏడునెలల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. కొంతకాలం రెండు కుటుంబాల వారికి దూరంగా మంచిర్యాల, కోటపల్లిలో కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మద్యానికి బానిసైన సాయికృష్ణ.. మూడునెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి సౌందర్య తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది.  ప్రేమ పేరుతో కొడుకును తమకు దూరం చేసిందని కోడలిపై కక్ష పెట్టుకున్న సాయికృష్ణ తండ్రి తిరుపతి.. సోమవారం మధ్యాహ్నం సౌందర్య ఇంటికి వచ్చాడు. నిద్రలో ఉన్న ఆమె తండ్రి లక్ష్మయ్యపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అనూహ్య ఘటనతో భయపడి బయటకు పరుగుదీసిన కోడలిని వెంటాడి కర్కశంగా గొంతుకోశాడు. అక్కడి నుంచి పరారయ్యాడు. చెన్నూరు గ్రామీణ సీఐ నాగరాజు, ఎస్సై రవికుమార్‌ తండ్రీకూతుళ్లను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సౌందర్య ప్రాణాలు విడిచింది. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ లక్ష్మయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని అప్పగించే వరకు పోస్టుమార్టానికి అంగీకరించబోమని తాము వచ్చేలోపే మృతదేహాన్ని ఎందుకు ఆసుపత్రికి తరలించారని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విరమించలేదు. కాగా లక్ష్మయ్య- బానక్క దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా మృతురాలు సౌందర్యే చిన్నది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని