Crime News: అప్పు తీరుస్తామంటూ ప్రాణం తీశారు

తిరిగి కట్టక్కర్లేదని ఒకరు.. అధిక వడ్డీ వసూలు చేశారనే కోపంతో మరొకరు.. ఇద్దరూ కలిసి తమకు అప్పిచ్చిన వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన

Published : 05 Jan 2022 08:47 IST

తిరుపతిలో ఏపీటీడీసీ సూపర్‌వైజర్‌ హత్య

తిరుపతి (నేరవిభాగం), చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: తిరిగి కట్టక్కర్లేదని ఒకరు.. అధిక వడ్డీ వసూలు చేశారనే కోపంతో మరొకరు.. ఇద్దరూ కలిసి తమకు అప్పిచ్చిన వ్యక్తిని హతమార్చారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప కథనం ప్రకారం... తిరుపతి ఎల్‌బీనగర్‌లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్‌ (53) ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో సూపర్‌వైజరుగా పని చేస్తున్నారు. డిసెంబరు 31న బైకుపై ఇంటి నుంచి వెళ్లారు. మరుసటి రోజు ఇంటికి రాకపోవడం.. ఫోను తీయకపోవడంతో కుమారుడు రూపేశ్‌ కుమార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక రాయల్‌నగర్‌లో బైకు.. అందులో చరవాణి ఉండటాన్ని ఫోన్‌ ట్యాగింగ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. చంద్రశేఖర్‌ ఆచూకీ తెలియలేదు. కుటుంబ సభ్యులు ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేయడంతో దర్యాప్తు చేపట్టారు. తిరుచానూరు కృష్ణశాస్త్రినగర్‌కు చెందిన రాజును అదుపులోకి తీసుకుని విచారించారు. అతను చంద్రశేఖర్‌ వద్ద రూ.5 లక్షలు అప్పు తీసుకుని ఎక్కువ వడ్డీ వసూలు చేశారనే కోపంతో ఉన్నట్లు గుర్తించారు. పెద్దకాపు లేఔట్‌లో వ్యాపారం చేసే మధుబాబు రూ.14.50 లక్షలు అసలు, వడ్డీ కలిపి చంద్రశేఖర్‌కు ఇవ్వాల్సి ఉంది. ఆ అప్పు చెల్లించాలని ఆయన ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో మధుబాబు, రాజు కక్షగట్టారు. దామినీడులో ఉంటున్న చంద్రగిరి వాసి పురుషోత్తంను తమతో కలుపుకొన్నారు. డబ్బు ఇస్తామంటూ పెద్దకాపు లేఔట్‌కు రావాలని డిసెంబరు 31న చంద్రశేఖర్‌ను పిలిచారు. ఆయన అక్కడికి రాగానే ఇనుప కడ్డీతో బలంగా తలపై మోదారు. చంద్రశేఖర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. రక్తం కారకుండా ప్లాస్టర్‌ చుట్టి మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి భాకరాపేటఘాట్‌ దగ్గర అడవిలో పడేశారు. పోలీసులు మంగళవారం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మధుబాబు, పురుషోత్తం కోసం గాలిస్తున్నారు. చంద్రశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని