సీఐ బారి నుంచి కాపాడండి.. సీఎంకు వైకాపా మహిళా కౌన్సిలర్‌ విన్నపం

వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ... ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా మహిళా కౌన్సిలర్‌ వీడియో విడుదల చేయడం సోమవారం కలకలం సృష్టించింది. చీరాల ఐదో వార్డు కౌన్సిలరు సూరగాని లక్ష్మి భర్త నరసింహారావుకు

Updated : 11 Jan 2022 15:05 IST

చీరాల, న్యూస్‌టుడే: వ్యాపారాన్ని దెబ్బతీసి, బెదిరింపులకు పాల్పడుతున్న సీఐ నుంచి తమను కాపాడాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తూ... ప్రకాశం జిల్లా చీరాల పట్టణానికి చెందిన వైకాపా మహిళా కౌన్సిలర్‌ వీడియో విడుదల చేయడం సోమవారం కలకలం సృష్టించింది. చీరాల ఐదో వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి భర్త నరసింహారావుకు పట్టణంలో బార్‌ అండ్‌ రెస్టారెంటు ఉంది. డిసెంబరు 31న రాత్రి 11.20 గంటలకు ఒకటో పట్టణ సీఐ రాజమోహన్‌ సిబ్బందితో సహా రెస్టారెంటులోకి వచ్చి... తన భర్తను దుర్భాషలాడారని, ప్రాధేయపడినా వినకుండా దురుసుగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. సిబ్బందిని కొట్టడంతోపాటు తన భర్తను స్టేషన్‌కు తీసుకెళ్లి అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. దీనిపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశామన్న అక్కసుతో ఈనెల 8న రాత్రి మరోసారి రెస్టారెంటుకు వచ్చి... వ్యాపారం ఎలా చేస్తావో చూస్తానంటూ బెదిరించి, అక్కడ ఉన్న వారిని తరిమికొట్టారన్నారు. ఆయన బారి నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలంటూ వీడియోలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే స్థానిక వైకాపా నాయకులు వర్గాలుగా విడిపోయారు. ఇప్పుడు ఈ వీడియో మరింత అగ్గి రాజేసింది. ఈ విషయమై సీఐ రాజమోహన్‌ను వివరణ కోరగా... నూతన సంవత్సరం రోజున బార్‌లోంచి కేకలు వినపడటంతో తాను బయట ఉండి సిబ్బందిని లోపలకు పంపానని చెప్పారు. ఎవరిపైనా దాడి చేయలేదని, దూషించలేదని తెలిపారు. ఈ నెల 8న బార్‌లోకి వెళ్లలేదని... కావాలనే ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని