ఆ మొండెం జైహింద్‌ నాయక్‌దే

సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహడ్‌కు చెందిన జైహింద్‌నాయక్‌(30) హత్య కేసులో గురువారం దొరికిన మొండెం ఆయనదేనని డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. హైదరాబాద్‌ శివారు

Published : 15 Jan 2022 04:32 IST

డీఎన్‌ఏ పరీక్షల్లో నిర్ధారణ

ఈనాడు, నల్గొండ, పాలకవీడు గ్రామీణం, న్యూస్‌టుడే: సంచలనం సృష్టించిన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహడ్‌కు చెందిన జైహింద్‌నాయక్‌(30) హత్య కేసులో గురువారం దొరికిన మొండెం ఆయనదేనని డీఎన్‌ఏ పరీక్షలో తేలింది. హైదరాబాద్‌ శివారు తుర్కయాంజాల్‌లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో జైహింద్‌ మొండెం లభ్యమైన విషయం తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలు బయటపడతాయని నల్గొండ సీసీఎస్‌ డీఎస్పీ మొగులయ్య ‘ఈనాడు’కు వెల్లడించారు. మొండెం దొరికిన భవనానికి సంబంధించి శైలజ, పద్మ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటీవలే ఈ భవనాన్ని విక్రయించగా... తనకు తెలియకుండా అమ్మేశారని శైలజ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ భవనాన్ని ఎవరూ కొనకుండా ఉండేందుకు ఇలాంటి ఘటనకు ఏమైనా పాల్పడ్డారా? జైహింద్‌ కుటుంబ సభ్యులకు, భవన యజమానులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శైలజ, పద్మలతో పాటు  భవనాన్ని కొనుగోలు చేసినట్లు భావిస్తున్న ముస్లిం కుటుంబాన్ని పోలీసులు శుక్రవారం విచారించినట్లు తెలిసింది.


ఎవరీ పద్మ, శైలజ?

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, తుర్కయాంజాల్‌: జైహింద్‌ నాయక్‌ మొండెం లభించిన భవనం గతంలో కేశ్యానాయక్‌ది. ఆయన తొలుత పద్మను వివాహమాడారు. సంతానం లేదని తర్వాత శైలజను పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో తపాలా ఉద్యోగి అయిన కేశ్యానాయక్‌ను చంపేస్తే తనకు ఆయన ఉద్యోగం, బీమా సొమ్ము వస్తుందని మొదటి భార్య పద్మ పన్నాగం పన్నింది. భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసే వినోద్‌తో రూ.10 లక్షలకు సుపారీ కుదుర్చుకుంది. 2018 ఆగస్టులో అతడు కేశ్యానాయక్‌కు మద్యం తాగించి కారులో గొంతు నులిమి చంపేశాడు. ప్రమాదంగా చిత్రీకరించేందుకు కారుతో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టాడు. వనస్థలిపురం పోలీసుల పరిశోధనలో.. హత్య అని తేలడంతో వినోద్‌, పద్మలను అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని