చిరునవ్వులకు.. మూడుముళ్ల సంకెళ్లు!

మెడలో వేసిన పసుపు తాడు.. చిట్టి వయసులోనే ఆశలు, ఆశయాలను చిదిమేస్తున్నాయి. ఏటా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. వీటి మూలంగా బాలికల భవిత, భద్రతకు విఘాతం కలుగుతోంది. చిట్టి వయసులో

Updated : 15 Jan 2022 06:39 IST

 గుట్టుగా బాల్య వివాహాలు


అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: మెడలో వేసిన పసుపు తాడు.. చిట్టి వయసులోనే ఆశలు, ఆశయాలను చిదిమేస్తున్నాయి. ఏటా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు పెద్దసంఖ్యలో జరుగుతున్నాయి. వీటి మూలంగా బాలికల భవిత, భద్రతకు విఘాతం కలుగుతోంది. చిట్టి వయసులో ‘పెళ్లి’ అనే పెనుభారాన్ని మోయలేక లోలోన మదన పడుతున్నారు. పేదరికం, ఆర్థిక, నిరక్షరాస్యత.. వంటి సామాజిక రుగ్మతల మూలంగా ఆరేడు తరగతుల్లోనే బాలికలను ఓ అయ్య చేతిలో పెట్టేస్తున్నారు. చిన్నారులు పెళ్లి కూతుళ్లుగా మారిపోతున్నారు. మారుమూల గ్రామాల్లోనే కాదు.. పట్టణాల్లో సైతం ఈ పోకడ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బాల్య వివాహాల నిషేధ చట్టం-2006ను కఠినంగా అమలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. 
అడ్డగించేవారేరీ?
బాల్య వివాహాలను అడ్డగించే బాధ్యత కేవలం ఐసీడీఎస్‌ శాఖదే అన్న భావన నెలకొంది. ఎక్కడైనా ఈ తరహా పెళ్లిళ్లు జరిగితే నేరుగా అంగన్‌వాడీ సిబ్బందికి సమాచారం వస్తోంది. వీరు మాత్రమే వెళ్తున్నారు. అయితే చట్ట ప్రకారం పోలీసు, రెవెన్యూ అధికారులు కీలకం. క్షేత్రస్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులు బాల్య వివాహాల నిరోధక అధికారులుగా ఉన్నారు. వీరు తగిన దృష్టి సారించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా బాలల సంరక్షణ సమితి(డీసీపీఓ) సారథ్యంలో పాఠశాల, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ఫలితాలు ఒనగూరలేదు. చైల్డ్‌లైన్‌ 1098, 181, 100కు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నా సకాలంలో క్షేత్రస్థాయికి వెళ్లడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.


అవగాహన కల్పిస్తున్న పీడీ సుజన 

విస్తృత ప్రచారం చేస్తున్నాం
బాల్య వివాహాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం. పోలీసు, రెవెన్యూ, చైల్డ్‌లైన్‌ 1098, ఎన్జీఓ ప్రతినిధుల సహకారంతో నిరోధిస్తున్నాం. బాల్య వివాహాల మూలంగా జరిగే అనర్థాలపై వివరిస్తున్నాం. బాలికల ఆరోగ్యం, వారి భవిష్యత్తుపై తెలియజేస్తున్నాం. సీఆర్‌పీలు సైతం డ్రాప్‌అవుట్‌పై పని చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ నిరోధించడానికి శ్రమిస్తున్నాం. - సుజన, పీడీ, ఐసీడీఎస్‌

 బాల్య వివాహాలతో ముప్పు
* బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. 
* 18ఏళ్ల తర్వాతే బాలికల శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది.
* చిన్న వయసులో గర్భం దాల్చే బాలికల్లో గర్భస్రావం ఎక్కువ. 
* శిశు మరణాలే కాదు.. తల్లుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుంది.
* పుట్టబోయే శిశువు తక్కువ బరువుతో ఉంటారు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. 
* 65 శాతం బాలికల్లో రక్తహీనత ఉంది. పోషణ లోపం కూడా ఎక్కువే. ఈక్రమంలో గర్భం దాల్చడం మంచిదికాదు.
* 21 ఏళ్లలోపు గర్భం దాల్చడం శ్రేయస్కరం కాదని వైద్యులు సూచిస్తున్నారు.

కూడేరులో అధికం
2019లో 345 బాల్య వివాహాలను అడ్డగించినట్లు ఐసీడీఎస్‌ యంత్రాంగం లెక్కలు నమోదు చేసింది. 2020లో 372, గతేడాది 403 వివాహాలను నియత్రించినట్లు తెలుస్తోంది. కూడేరులో ఎక్కువగా 53 వివాహాలను రద్దు చేయించారు. ఆ తర్వాత స్థానంలో శింగనమల, పెనుకొండ, హిందూపురం, అనంతపురం పట్టణం, కదిరి తూర్పు, పశ్చిమం, గుత్తి, కంబదూరు, కళ్యాణదుర్గం, మడకశిర వంటి ప్రాంతాలు ఉన్నాయి. రాయదుర్గం, మడకశిర, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, కదిరి వంటి ప్రాంతాల్లో బాల్య వివాహాలు రహస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని