
గొంతులో పల్లీలు ఇరుక్కునిబాలుడి మృతి
కేతేపల్లి, న్యూస్‌టుడే: పల్లీలను తింటుండగా గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చీకటిగూడెం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల సైదులు, శైలజ దంపతులు ఆదివారం బంగారు మైసమ్మ దేవాలయంవద్ద పండగ చేసేందుకు బంధువులను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంలో నివసిస్తున్న శైలజ సోదరి రేణుక, ఆమె భర్త మల్లేష్, రెండున్నరేళ్ల వయసున్న వారి కుమారుడు అద్విత్ వచ్చారు. అందరూ పండగ ఏర్పాట్లలో నిమగ్నమవగా వంటింట్లో ఉన్న పల్లీలను తీసుకుని ఒక్కసారిగా నోట్లో వేసుకున్నాడు. అవి శ్వాసనాళంలో ఇరుక్కోవడంతో బాలుడికి ఊపిరాడలేదు. గమనించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెంటనే సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.