
పంచప్రాణాలు గల్లంతు!
ప్రాణహితలో మునిగి ముగ్గురు విద్యార్థులు..
చేపల వేటకు వెళ్లి కృష్ణానదిలో మరో ఇద్దరు
కోటపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు, న్యూస్‌టుడే : సరదాగా ప్రాణహిత తీరానికి వెళ్లిన ముగ్గురు విద్యార్థులు.. కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లిన మరో ఇద్దరు గల్లంతైన ఘటనలు మంచిర్యాల- మహారాష్ట్ర సరిహద్దు ఆల్గామ, సూర్యాపేట జిల్లా అడ్లూరులో సోమవారం విషాదం నింపాయి. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సెలవులకు సొంత గ్రామమైన ఆల్గామకు వచ్చిన విద్యార్థులు అంబాల సాయి(15), అంబాల వంశీ(18), గారే రాకేష్(17)లు తమ బంధువులు, స్నేహితులైన తగరం శ్రావణ్, అంబాల రఘు, గారే కార్తీక్‌లతో కలిసి సోమవారం ప్రాణహిత నదికి వెళ్లారు. ఈత రాకపోయినా ఒడ్డున స్నానం చేద్దామని నీటిలో దిగారు. ఒక్కొక్కరుగా ముగ్గురు మునిగిపోగా.. రఘు, కార్తీక్‌లు తేరుకొని బయటికి వచ్చారు.మునిగిపోతున్న శ్రావణ్‌ను మత్స్యకారుడు అశోక్ రక్షించారు. మంచిర్యాల ఆర్డీవో వేణు, తహసీల్దార్ గోవింద్, చెన్నూరు సీఐ నాగరాజు.. గాలింపును ముమ్మరం చేశారు. గల్లంతైన విద్యార్థుల్లో సాయి భీమారంలో 9వ తరగతి.. వంశీ చెన్నూరులో ఇంటర్ ద్వితీయ, రాకేష్ హనుమకొండలో ఇంటర్ ప్రథమ చదువుతున్నారు.
బోటు బోల్తా పడి..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం అడ్లూరుకు చెందిన కందుకూరి చంద్రశేఖర్(25), కొమ్ము శ్రీగోపి(12) చేపలవేటకు పులిచింతల జలాశయం పరిధిలోని వెనుక జలాల్లోకి వెళ్లి గల్లంతయ్యారు. రోజూలానే వీరిద్దరూ చేపలను తెచ్చేందుకు సోమవారం వెనుక జలాల్లోకి వెళ్లారు. బోటు బోల్తా పడి నీళ్లలో పడిపోయారు. ఈతరాని గోపి మునిగిపోతుండటంతో చంద్రశేఖర్ రక్షించే యత్నం చేశాడు. నీటి ఉద్ధృతి పెరగడంతో ఇద్దరూ గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు.