ప్రజాప్రతినిధులే లక్ష్యంగా మోసాలు

తాను ఏసీబీ వలలో చిక్కి ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఓ ఎమ్మెల్యే కారణమని భావించి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరతీశాడు. చర్లపల్లి జైలులో పరిచయమైన మరొకరితో కలిసి వెబ్‌సైట్‌

Published : 21 Jan 2022 05:39 IST

ఉద్యోగం కోల్పోవడానికి వారే కారణమని నిందితుడి వల
రెండు రాష్ట్రాల్లో 50 కేసులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తాను ఏసీబీ వలలో చిక్కి ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఓ ఎమ్మెల్యే కారణమని భావించి ఓ వ్యక్తి ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెరతీశాడు. చర్లపల్లి జైలులో పరిచయమైన మరొకరితో కలిసి వెబ్‌సైట్‌ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్‌నంబర్లు తెలుసుకుని మోసపూరిత ఫోన్‌కాల్స్‌కు పాల్పడ్డాడు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలకు వారు ఫోన్లు చేసి అందినకాడికి దోచుకున్నారు. నమోదైన 50 కేసుల్లో రూ.70 లక్షల వరకు కాజేసిన ఆ ఇద్దరి నిందితులను తిరుపతి అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం తమ కార్యాలయంలో అదనపు ఎస్పీ సుప్రజ మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు తెలిపారు. ‘ఈ నెల 14న తిరుపతి ఎంపీ గురుమూర్తికి.. అభిషేక్‌ అనే వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. కేంద్ర నిధులు మంజూరయ్యాయని, చలానా కింద 5శాతం చెల్లించాలని పదేపదే తెలిపారు. ఎంపీకి అనుమానం వచ్చి సీఎంవోలో విచారించి అలిపిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 19న తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన తోట బాలాజీనాయుడు (40), శ్రీకాకుశం జిల్లా మందసకు చెందిన మేకల అభిషేక్‌(22)గా వారిని గుర్తించారు. విచారణలో.. ఎన్‌టీపీసీలో ఉద్యోగం చేస్తున్న బాలాజీనాయుడు ఓ కేసులో ఉద్యోగం పోగొట్టుకుని జైలుకు వెళ్లాడని తేలింది. మరో కేసులో జైల్లో ఉన్న అభిషేక్‌తో ఆయనకు పరిచయమేర్పడి ఇద్దరూ డబ్బు కాజేసేందుకు ప్రయత్నించి చిక్కారు’ అని అదనపు ఎస్పీ వివరించారు. 2017లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి ఇదే తరహాలో నిందితులు ఫోన్‌ చేసినందుకు ముత్యాలరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని