
Crime News: రేణిగుంటలో దారుణం..భర్తను చంపి.. తల, మొండెం వేరు చేసి..
తలతో పోలీసుస్టేషన్లో లొంగిపోయిన వివాహిత
రేణిగుంట, న్యూస్టుడే: భర్తను భార్య దారుణంగా పొడిచి చంపిన ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ అంజుయాదవ్ కథనం మేరకు.. స్థానిక పోలీసు లైన్ వీధిలో కాపురం ఉంటున్న శ్రీభాష్యం రవిచంద్ర సూరి(53) స్వగ్రామం గుంటూరు జిల్లా నరసరావుపేట. రేణిగుంట పారిశ్రామికవాడలో చిన్న రీసైకిల్ పరిశ్రమ నడుపుతున్నారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు ఉన్నారు. సూరి మరో మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని వసుంధర తట్టుకోలేకపోయింది. తనను, కుమారుడిని రోడ్డున పడేస్తారేమోనని భయాందోళన చెందారు. ఈ విషయమై పలుమార్లు భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం ఉదయం ఇంట్లో సూరి అల్పాహారం తింటుండగా కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం మొండెం, తల వేరు చేసి సంచిలో తల వేసుకుని కుమారుడిని వెంటబెట్టుకొని పోలీసుస్టేషన్లో లొంగిపోయింది. సీఐ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ఎస్వీ వైద్యకళాశాలకు తరలించారు. పోలీసుల విచారణలో వసుంధర వింతగా ప్రవర్తించినట్లు సమాచారం.