
ఆగిన లారీని ఢీకొన్న యాత్రికుల బస్సు
9మందికి గాయాలు.. 7గంటలపాటు బస్సులోనే వృద్ధులు, పిల్లలు
‘ఈనాడు-ఈటీవీ’ చొరవతో స్పందించిన ఎస్పీ
భోగాపురం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా డెంకాడ మండలం నాతవలస జాతీయ రహదారిపై వేకువజామున 4గంటల సమయంలో మహారాష్ట్ర నుంచి తిరుపతి వెళ్తున్న యాత్రికుల బస్సు ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ముందు భాగం నుజ్జునుజ్జయి తలుపునకు లాక్ పడడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. స్థానికులు చేరుకొని క్షతగాత్రులను కష్టం మీద బయటకు తీసి 108లో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆ తరువాత బస్సులో మిగిలి ఉన్న 41 మంది వృద్ధులు, మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ సుమారు 7గంటలపాటు అందులోనే గడిపారు. కొందరు వృద్ధులు కాలకృత్యాలకు బయటకు వెళ్లలేక అక్కడే చేసుకున్న దుర్భర పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ‘ఈనాడు-ఈటీవీ’ బృందం అక్కడికి చేరుకుని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌కు సెల్ఫోన్లో సమాచారం అందించగా ఆమె స్పందించారు. మూడు హైవే మొబైల్ వాహనాలతోపాటు పూసపాటిరేగ, డెంకాడ మండలాల ఎస్సైలు సిబ్బందితో సత్వరం వచ్చారు. బస్సు అత్యవసర ద్వారాన్ని తెరిచి ఒక్కొక్కరిని దింపారు. టీ, బిస్కెట్లు, అల్పాహారం అందించారు. మహారాష్ట్రకు చెందిన వీరంతా పూరి, కోల్‌కతా చూసి తిరుమల దర్శనానికి వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.