క్షమించమ్మా.. వైద్యం చేయించలేకపోతున్నా!

కరోనా కష్టకాలం.. అంతంతమాత్రంగా వ్యాపారం.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి.. ఆమెకు వైద్యం చేయించలేకపోతున్నానన్న మనోవేదనతో ఓ యువకుడు శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 22 Jan 2022 06:40 IST

మనోవేదనతో రైలు కింద పడి కుమారుడి ఆత్మహత్య  

నాంపల్లి, న్యూస్‌టుడే: కరోనా కష్టకాలం.. అంతంతమాత్రంగా వ్యాపారం.. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి.. ఆమెకు వైద్యం చేయించలేకపోతున్నానన్న మనోవేదనతో ఓ యువకుడు శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి రైల్వే పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. ఫతేనగర్‌లోని ఇందిరాగాంధీపురం బస్తీకి చెందిన చిన్నంశెట్టి కృష్ణమూర్తియాదవ్‌, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శ్రీకాంత్‌యాదవ్‌(24) సంతానం. కొన్నేళ్ల క్రితమే భాగ్యలక్ష్మి భర్త నుంచి దూరంగా వచ్చేశారు. కుమార్తెలిద్దరికి పెళ్లి చేసి, కుమారుడితో కలిసి టిఫిన్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా భాగ్యలక్ష్మి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో శ్రీకాంత్‌యాదవ్‌ ఒకవైపు టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తూనే, తల్లికి వైద్యం చేయిస్తున్నాడు. ఏడాదిన్నరగా కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఆరోగ్యం క్షీణించి తల్లి పడుతున్న బాధలు చూడలేకపోతున్నానని, వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నానని వారం క్రితం తన మేనమామకు ఫోన్‌లో చెప్పాడు శ్రీకాంత్‌యాదవ్‌. గురువారం సాయంత్రం ఇంటి నుంచి టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లిన యువకుడు.. రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. స్థానికుల సాయంతో తల్లి సనత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లి రైల్వే పోలీసులు శుక్రవారం ఉదయం లింగంపల్లి- చందానగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై శ్రీకాంత్‌యాదవ్‌ మృతదేహాన్ని గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని