కొవిడ్‌కూ ‘నకిలీ’ వైరస్‌

కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకుండానే నెగెటివ్‌ రిపోర్టులు, టీకా వేసుకోకపోయినా వేసినట్లు ధ్రువపత్రాలు ఇస్తున్న రెండు ముఠాలను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు

Published : 22 Jan 2022 05:08 IST

అంగట్లో నెగెటివ్‌ నివేదికలు నకిలీ టీకా సర్టిఫికెట్లు
నమూనాల్లేకుండానే రిపోర్టులు.. కొవిన్‌లోనూ నమోదు  
రెండు ముఠాలను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చంచల్‌గూడ: కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకుండానే నెగెటివ్‌ రిపోర్టులు, టీకా వేసుకోకపోయినా వేసినట్లు ధ్రువపత్రాలు ఇస్తున్న రెండు ముఠాలను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు కొద్దిరోజుల నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర బృందం మలక్‌పేట, ఆసిఫ్‌నగర్‌లలో దాడులు నిర్వహించింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి 70 నకిలీ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు, 50 టీకా సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు పారిపోయారని, వారిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. డబ్బు తీసుకుని కొవిడ్‌ సర్టిఫికేట్లు ఇస్తామంటే తీసుకోవద్దని, అవి తీసుకుంటే విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతారని ఆయన హెచ్చరించారు.  

రూ.2-3 వేలకే నెగెటివ్‌ సర్టిఫికేట్‌
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పి.లక్ష్మణ్‌ మలక్‌పేటలోని ఆస్మాన్‌గఢ్‌లో కొన్నేళ్లుగా హోంకేర్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతి పొందిన ఆయన... నమూనాలను మెడిక్స్‌ పాథ్‌ల్యాబ్‌ ఇండియాకు పంపించి ఫలితాలను తెప్పించేవాడు. నెగెటివ్‌ రిపోర్టు కావాలనుకునే వారి నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేలు తీసుకుని డమ్మీ నమూనాలను పంపించి నెగెటివ్‌ రిపోర్టులు తెప్పించేవాడు. హోంకేర్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌కు ప్రభుత్వ అనుమతి ఉండడంతో పరిశీలించిన వారికి అనుమానం వచ్చేది కాదు.

టీకా పత్రానికి రూ.800-1000  
మహ్మద్‌ తారిఖ్‌ హబీబ్‌ మురాద్‌నగర్‌లో ఇమేజ్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. ఇతడు కూడా డమ్మీ నమూనాలు పంపించి నెగెటివ్‌  నివేదికలు తెప్పించేవాడు. టీకా వేసుకునేందుకు భయపడేవారు, కొవిన్‌ పోర్టల్‌లో పేర్లు నమోదుచేసుకున్నా సమయం రానివారు తారిఖ్‌ను సంప్రదించేవారు. వారి వివరాలను తారిఖ్‌, అఫ్జల్‌సాగర్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో పొరుగు సేవల విభాగంలో పనిచేసే కుమారి వద్దకు పంపించేవాడు. ఆమె కొవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసేది. ఈ క్రమంలోనే మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌లలో ఉంటున్న ట్రావెల్‌ ఏజెంట్లు గులామ్‌ ముస్తఫా షకీల్‌, అబ్దుల్‌ బషీర్‌లు రెండున్నర నెలల నుంచి ఒక్కో దానికి రూ.800-1000 ఇచ్చి టీకా ధ్రువపత్రాలను తీసుకుంటున్నారు. తారిఖ్‌, ఇర్ఫాన్‌, కుమారిలతోపాటు ట్రావెల్‌ ఏజెంట్లను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని