Updated : 26 Jan 2022 05:36 IST

నోటిఫికేషన్లు లేవు.. పిచ్చి లేస్తోంది

రైలుకింద పడి నిరుద్యోగి బలవన్మరణం

ఈటీవీ, ఖమ్మం: ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక ఎస్సై కావాలన్న తన కల సాకారం కాదేమోనని ఓ పేద కుటుంబంలోని నిరుద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసు ఉద్యోగం కోసం చిన్నప్పటి నుంచి పరితపించిన అతడు ఎన్‌సీసీలోనూ సీ సర్టిఫికెట్‌ సంపాదించాడు. రెండున్నరేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్న ముత్యాల సాగర్‌(24) మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం మామిళ్లగూడెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం. సోమవారం అర్ధరాత్రి 2.45 గంటలకు అతడి మొబైల్‌లోని వాట్సప్‌ స్టేటస్‌లో.. ‘నోటిఫికేషన్‌లు లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్‌, కరోనా కారణం’ అని ఉండడాన్ని పోలీసులు గుర్తించారు.

డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని..

సాగర్‌ తండ్రి భద్రయ్య హమాలీ. తల్లి కళమ్మ కూలీ. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. రెండేళ్ల కిందట కుమార్తె సౌజన్య వివాహం చేశారు. సాగర్‌ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐదేళ్లుగా ఖమ్మంలోనే ఉంటున్నాడు. ఓ ప్రైవేటు కళాశాలలో 2019లో డిగ్రీ పూర్తి చేశాడు. స్నేహితులతో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటూండగా 3 నెలల క్రితం వారు వెళ్లిపోవడంతో ఒక్కడే కాలం గడుపుతున్నాడు. జేబు ఖర్చులకు డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని.. వారికి భారం కాకూడదని ఖాళీ సమయంలో క్యాటరింగ్‌ పనులకు వెళ్లేవాడు. సంక్రాంతి పండుగకి ఇంటికి వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చాడు. తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తేగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాతే చేసుకుంటానని చెప్పాడు. సోమవారంరాత్రి తల్లితో ఫోన్‌లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడ్డాడు.

శవాగారం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే సాగర్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడని కాంగ్రెస్‌, భాజపా, న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ నాయకులతోపాటు పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఏఎస్‌ఎఫ్‌, బీజేవైఎం వారు ఆందోళన చేశారు. వారి ఆందోళనతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శవాగారం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నినాదాలు చేశారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. వామపక్ష విద్యార్థి నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేయగా.. భాజపా నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

స్వగ్రామంలో విపక్షాల ఆందోళన

బయ్యారం, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ వైఖరి కారణంగానే సాగర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని బయ్యారం మండలంలోని విపక్షపార్టీలన్నీ ఆందోళనకు దిగాయి. కులసంఘాల నాయకులు, నిరుద్యోగులు మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం వెంట వచ్చి రామాలయం సెంటర్‌లో ఆందోళన చేపట్టారు. ఇల్లెందు, మహబూబాబాద్‌ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్‌ సూచనతో మహబూబాబాద్‌ డీఎస్పీ సదయ్య, తహసీల్దార్‌ రంజిత్‌  బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2లక్షలు ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీఇచ్చారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని