నకిలీ నియామక పత్రాలు, ఉత్తుత్తి శిక్షణ

కోల్‌కతా కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ హైదరాబాద్‌లో ఉంటున్న ఘరానా నేరస్థులు పలువురిని మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6-13 లక్షల వరకు దండుకున్నారు. ఏడాదైనా ఉద్యోగాలు

Published : 27 Jan 2022 04:45 IST

తూర్పు రైల్వేలో ఉద్యోగాలంటూ దగా
నిరుద్యోగుల నుంచి రూ.కోట్ల స్వాహా

ఈనాడు, హైదరాబాద్‌: కోల్‌కతా కేంద్రంగా ఉన్న తూర్పు రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ హైదరాబాద్‌లో ఉంటున్న ఘరానా నేరస్థులు పలువురిని మోసం చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.6-13 లక్షల వరకు దండుకున్నారు. ఏడాదైనా ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు తూర్పు రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని రూ.1.13కోట్లు, తెలంగాణ హైకోర్టులో కొలువులంటూ రూ.1.40కోట్లు నిందితులు వసూలు చేసినట్లు గుర్తించారు. బాధితులు తెలిపిన వివరాల ఆధారంగా బండారి శ్రీనివాస్‌, శ్రీకర్‌, నాగరాజులపై కేసు నమోదు చేశారు.

దరఖాస్తు చేసుకోకున్నా..

రైల్వే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోకున్నా మంత్రుల కోటాలో ఇప్పిస్తామని బండారి శ్రీనివాస్‌, నాగరాజు, శ్రీకర్‌ తదితరులు ఉద్యోగార్థులను నమ్మించారు. 2019 నవంబరులో దరఖాస్తు చేసేందుకు కోల్‌కతాకు రావాలంటూ సూచించారు. అక్కడికి బాధితులు వెళ్లగానే.. వారిని శ్రీనివాస్‌ కార్యాలయం వెలుపలే ఉంచాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.3లక్షలు తీసుకున్నాడు. 2020 జనవరిలో మరోసారి కోల్‌కతాకు రమ్మన్నారు. ఉద్యోగాలకు ఎంపికయ్యారని, వైద్యపరీక్షలు చేయిస్తామంటూ చెప్పారు. రైల్వేస్టేషన్‌ వెలుపల ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షలు చేయించి ధ్రువపత్రాలు తీసుకున్నారు. నియామక పత్రాలు పంపుతామని, అవి వచ్చాక రూ.3లక్షలు ఇవ్వాలన్నారు. అనంతరం వారంరోజుల్లో నియామకపు పత్రాలు పంపించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా 2021 మార్చి వరకు కాలయాపన చేశారు. జూన్‌లో శిక్షణ కాలమంటూ రెండునెలలు ఒక్కొక్కరికీ రూ.19వేల జీతం ఇచ్చారు. తర్వాత అదీ ఇవ్వకపోవడంతో ఒక బాధితుడి సోదరుడికి అనుమానం వచ్చి కోల్‌కతాలో విచారించగా.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషనే రాలేదని తేలింది. ఇచ్చినవి నకిలీ నియామక పత్రాలని నిర్ధారణ అయింది. దగాను గుర్తించిన బాధితులు అప్పటినుంచి డబ్బు తిరిగివ్వాలంటూ అడిగినా నిందితులు స్పందించలేదు. ఈ క్రమంలో బాధితులు రెండురోజుల క్రితం సీసీఎస్‌ పోలీసుల ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని