ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ముగ్గురు రైతుల బలవన్మరణం

ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో బుధవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  భూమిని కాలువ నిర్మాణంలో కోల్పోవడంతో ఒకరు, పత్తి, మిరప సాగులో వచ్చిన నష్టాలు తట్టుకోలేక మరో ఇద్దరు

Published : 27 Jan 2022 04:47 IST

డోర్నకల్‌, నర్మెట్ట, మహదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో బుధవారం ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  భూమిని కాలువ నిర్మాణంలో కోల్పోవడంతో ఒకరు, పత్తి, మిరప సాగులో వచ్చిన నష్టాలు తట్టుకోలేక మరో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు.  

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ఉయ్యాలవాడకు చెందిన కాలసాని భిక్షం(71) తనకున్న అయిదెకరాల భూమిలో ఇటీవల సీతారామ ప్రాజెక్టు కాల్వ కోసం 1.13 ఎకరాలు కోల్పోయారు. నష్టపరిహారం అందినా.. అందులోనే వ్యవసాయ బావి ఉండడంతో మిగతా పంటల సాగుకు ఇబ్బందిగా మారింది. దీనికితోడు పంటకు నీరందించే పైపులైను సైతం పగిలిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు.. బుధవారం తోటలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుమారుడు పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఆగపేటకు చెందిన యువ రైతు నూనె రాజశేఖర్‌(30) తనకున్న రెండెకరాల్లో పత్తి పంట సాగు చేశారు. దిగుబడి సరిగా రాకపోవడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చలేకపోయారు. అనారోగ్యంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నారు. వీటన్నింటికీ కలిపి రూ.3.5 లక్షల అప్పు చేశారు. ఈ రుణం తీర్చలేననే మనస్తాపంతో బుధవారం ఉదయం వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య కల్యాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం అంబట్‌పల్లి గ్రామానికి చెందిన పుట్ట రవి(36) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశారు. పంట తెగుళ్ల బారిన పడి మొక్కలన్నీ చనిపోయాయి. దీంతో పెట్టుబడి కోసం చేసిన రూ.12 లక్షల అప్పు తీర్చే మార్గంలేక.. బుధవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని