Crime News: చెప్పుల దండతో మహిళ ఊరేగింపు

గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఓ వివాహితను కొందరు వ్యక్తులు ఆమె ఇంటి నుంచి అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆమె జుత్తు కత్తిరించి

Updated : 28 Jan 2022 06:48 IST

బాధితురాలి జుత్తు కత్తిరించిన నిందితులు  
దిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి అరెస్టు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 20 ఏళ్ల ఓ వివాహితను కొందరు వ్యక్తులు ఆమె ఇంటి నుంచి అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం ఆమె జుత్తు కత్తిరించి, ముఖానికి నల్ల రంగు పూసి, మెడలో చెప్పుల దండ వేసి బెల్టులు, కర్రలతో దాడి చేస్తూ బహిరంగంగా ఊరేగించారు. ఆ సమయంలో అక్కడున్నవారు ఈ దారుణాన్ని ఆపకపోగా ఈలలు వేస్తూ ప్రోత్సహించడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. కస్తూర్బా నగర్‌లో జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఒకే కుటుంబానికి చెందిన 11 మంది నిందితుల్లో 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖా శర్మ, దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి వైద్య సహాయం, భద్రత కల్పించడంతోపాటు చట్ట ప్రకారం పరిహారం అందించాలని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ ఆస్థానాకు రేఖా శర్మ లేఖ రాశారు. బాధితురాలిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు స్వాతి మలివాల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. బాధితురాలిని ఆమె పరామర్శించారు. మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఈ ఘటనను ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను కోరారు. అయితే బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, లైంగికంగా వేధించి హింసించారని తెలిపారు. బాధితురాలిపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే నిందితులు దాడి చేసినట్లు చెప్పారు. బాధితురాలి తల్లి ఇంటి సమీపంలో నిందితుల కుటుంబం నివసిస్తోందని, ఆమెకు, నిందితుల కుటుంబానికి చెందిన ఓ బాలుడికి మధ్య స్నేహం ఉండేదని పోలీసులు తెలిపారు. అయితే ఆ బాలుడు గత నవంబరులో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆ మహిళే కారణమని భావించిన నిందితులు ఆమెపై ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంలో ఆనంద్‌ విహార్‌లోని ఆమె భర్త ఇంటి నుంచి అపహరించి కస్తూర్బా నగర్‌లోని తమ ఇంటికి తీసుకొచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని