ఉసురు తీసిన వేగం

ఓ ట్రక్కు డ్రైవర్‌ అవగాహనలోపం, బొగ్గు టిప్పర్‌ వేగం.. నలుగురు మహిళా కూలీల ఉసురు తీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి జాతీయ....

Updated : 29 Jan 2022 06:02 IST

కూలీలతో వెళ్తున్న ట్రక్కును ఢీకొన్న టిప్పర్‌.. నలుగురి మృతి

చంద్రుగొండ, సుజాతనగర్‌- న్యూస్‌టుడే: ఓ ట్రక్కు డ్రైవర్‌ అవగాహనలోపం, బొగ్గు టిప్పర్‌ వేగం.. నలుగురు మహిళా కూలీల ఉసురు తీసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి జాతీయ రహదారి ప్రధాన కూడలిలో శుక్రవారం ఉదయం జరిగింది. చంద్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన రైతు దంపతులు సుజాత్‌నగర్‌ ఎస్సీ కాలనీకి చెందిన 14 మంది కూలీలను పనికోసం తీసుకెళ్తున్నారు. మరో ఇద్దరు చిన్నారులతో కలసి మొత్తం 18 మంది ట్రాలీ వాహనంలో సత్తుపల్లి మండలం నామనగర్‌కు వెళ్తున్నారు. ఈ వాహనం తిప్పనపల్లి ప్రధాన సెంటర్‌లో జాతీయ రహదారిపైకి ఒక్కసారిగా ఎక్కింది. అదే సమయంలో సత్తుపల్లి నుంచి బొగ్గు లోడుతో వేగంగా వస్తున్న టిప్పర్‌ దానిని ఢీకొంది. ట్రాలీలో ఉన్న కూలీల్లో ఎక్కిరాల సుజాత(35) కత్తి స్వాతి(27) అక్కడికక్కడే మృతిచెందారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో గుర్రం లక్ష్మీదేవి(50), కత్తి సాయమ్మ(54) చనిపోయారు. కూలీల వాహనాన్ని ఢీకొన్న అనంతరం టిప్పర్‌ ఎదురుగా ఉన్న ఓఇంటి ప్రహరీని ఢీకొని పక్కకు పడిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న చిన్నారులు సందీప్‌(14), ఈశ్వర్‌లు దూకేసి ప్రాణాలతో బయటపడ్డారు. 11 మంది క్షతగాత్రులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో మహిళ కత్తి లక్ష్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. బొగ్గు టిప్పర్‌ డ్రైవరు పరారీలో ఉన్నాడు.

అమ్మ ఇక్కడ పడుకుందేంటి నాన్నా!

ప్రమాదంలో మృతిచెందిన సుజాతకు ఇద్దరు పిల్లలున్నారు. పొద్దున్నే పనికి వెళ్లిన అమ్మ ఇక్కడ పడుకుందేంటి నాన్నా అంటూ వారిద్దరూ అమాయకంగా తండ్రిని ప్రశ్నించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని