Updated : 04 Feb 2022 06:54 IST

Cryptocurrency: క్రిప్టో కరెన్సీకి పన్ను పేరుతో రూ.6.5 లక్షలు స్వాహా

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘క్రిప్టో కరెన్సీ’ ఆదాయాలపై పన్ను విధించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్‌లో ప్రతిపాదించిందో లేదో.. సైబర్‌ దొంగలూ వెంటనే అప్‌డేట్‌ అయ్యారు. మీ పెట్టుబడికి వచ్చిన లాభాలు పొందాలంటే కేంద్రం చెప్పినట్లు పన్నులు చెల్లించాల్సిందే అంటూ.. నగరవాసి నుంచి రూ.6.5 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం... రాంనగర్‌కు చెందిన వ్యక్తికి ఒకరు ఫోన్‌చేసి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో తమ కంపెనీ దేశంలోనే రెండోస్థానంలో ఉందని, పెట్టుబడులు పెట్టాలని కోరాడు. దీంతో బాధితుడు  విడతల వారీగా రూ.6.5 లక్షలు పెట్టేశాడు. ఆ సైబర్‌ దొంగల సృష్టించిన నకిలీ వెబ్‌సైట్‌లో ఆ మొత్తం మూడింతలైనట్లు కనిపించినా విత్‌డ్రా చేసుకునేందుకు వీలుపడలేదు. ‘కేంద్రం క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30 శాతం పన్నులు చెల్లించాలని చెప్పింది. వాటిని చెల్లించి మీ లాభాలు తీసుకోండి’ అని చెప్పడంతో మోసపోయానని గుర్తించాడు. అలాగే మరో కేసులో  కంపెనీ యజమాని చిత్రాన్ని డీపీగా పెట్టుకొని, వాట్సప్‌ కాల్‌చేసి రూ.9.8 లక్షలు కొల్లగొట్టేశారు. ఏసీపీ కె.వి.ఎం.ప్రసాద్‌ వివరాల ప్రకారం.. సైబర్‌ కిలాడీలు జూబ్లీహిల్స్‌లోని ఓ కెమికల్‌ కంపెనీ యజమాని చిత్రాన్ని డీపీగా ఏర్పాటు చేసుకొని, ఆ సంస్థ ఉద్యోగికి ఫోన్‌ చేశారు.  తాను పంపే బ్యాంక్‌ అకౌంట్‌ నంబరుకు రూ.9.8 లక్షలు పంపించమని నమ్మబలికారు. విశ్వసించిన వ్యక్తి సదరు ఖాతాకు రూ.9.8 లక్షలు పంపించి మోసపోయాడు.

రేస్‌కోర్స్‌ పేరుతో బెట్టింగ్‌లు
తమ అనుమతి లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్‌ రేస్‌కోర్స్‌ పేరుతో బెట్టింగ్‌లు కాస్తున్నారంటూ సంస్థ నిర్వాహకులు సైబర్‌ క్రైమ్‌ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు.  మలక్‌పేట్‌లోని హైదరాబాద్‌ రేస్‌కోర్సు పేరు, వివరాలు ఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. తమకు తెలియకుండానే రేస్‌కోర్సు పేరుతో బెట్టింగ్‌లు కాస్తున్నారని సంబంధిత నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని