Crime News: రూ.3 లక్షలకు ఇంజినీరింగ్‌.. రూ.2.5 లక్షలిస్తే ఎంబీఏ

పరీక్షలు రాయకుండానే రూ.లక్షలు పుచ్చుకొని ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ పట్టాలు ఇస్తున్న రెండు ముఠాలను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు.

Updated : 16 Feb 2022 09:22 IST

భోపాల్‌ వర్సిటీ నుంచి నకిలీ పట్టాలు ఇస్తున్న పదిమంది అరెస్టు

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న కొత్వాల్‌ సీవీ ఆనంద్‌. చిత్రంలో రమేష్‌, లింబాద్రి

ఈనాడు, హైదరాబాద్‌: పరీక్షలు రాయకుండానే రూ.లక్షలు పుచ్చుకొని ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ పట్టాలు ఇస్తున్న రెండు ముఠాలను ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయం కేంద్రంగా ఈ అక్రమాలు చేస్తున్న వర్సీటీ సహాయ ఆచార్యుడు కేతన్‌ సింగ్‌ గుండేలా, హైదరాబాద్‌లో కన్సల్టెన్సీల నిర్వాహకులు గుంటి మహేశ్వర్‌రావు, అంచ శ్రీకాంత్‌రెడ్డి, ఏడుగురు విద్యార్థులను అరెస్ట్‌ చేశామని కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉన్నతవిద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, సంయుక్త కమిషనర్‌ ఎం.రమేష్‌రెడ్డితో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆనంద్‌ ఆ వివరాలు వెల్లడించారు. ఇంజినీరింగ్‌కు రూ.3లక్షలు, బీఎస్సీ, బీకాం, బీఏ డిగ్రీలకు రూ.1.20లక్షల నుంచి రూ.2లక్షల వరకు, ఏంబీఏకు రూ.1.5లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు ముఠా సభ్యులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్‌ పట్టా కొన్న ఓ విద్యార్థి విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం అమెరికన్‌ కాన్సులేట్‌లో దరఖాస్తు చేయగా వారికి అనుమానం వచ్చి తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టగా నకిలీల గుట్టు వెలుగులోకి వచ్చింది.

70 శాతం.. 30శాతం వాటాలు: మలక్‌పేటలో శ్రీసాయి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ, మెహిదీపట్నంలోని ప్రైడ్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ పేర్లతో శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్వరరావులు కొన్నేళ్ల నుంచి విద్యార్థుల నుంచి నిర్ణీత రుసుం తీసుకుని సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో రెండున్నరేళ్ల క్రితం వీరిద్దరికీ భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న కేతన్‌ సింగ్‌ గుండేలా పరిచయమయ్యాడు. ఇంజినీరింగ్‌, డిగ్రీ ఫెయిలైన విద్యార్థులు, పదోన్నతులు పొందాలనుకుంటున్న కొందరు ఇంజినీరింగ్‌, డిగ్రీ పట్టాలు కావాలంటూ తమకు సంప్రదిస్తున్నారంటూ శ్రీకాంత్‌రెడ్డి, మహేశ్వరరావులు.. కేతన్‌సింగ్‌కు వివరించారు. వారి వివరాలు తనకు పంపితే టెలీకాలర్ల ద్వారా ఫోన్లు చేయించి రూ.లక్షల్లో ఒప్పందం కుదుర్చుకుని ఇంజినీరింగ్‌, డిగ్రీ సర్టిఫికేట్లు ఇప్పిద్దామని కేతన్‌ సింగ్‌ వారికి చెప్పాడు. తనకు 70శాతం ఇచ్చి 30శాతం తీసుకోవాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. పట్టాలు కావాలనుకునే వారి నుంచి నగదు బదిలీ చేయించుకున్నాక ధ్రువపత్రాలు పంపించాడు. మరోవైపు ప్రైడ్‌ కన్సల్టెన్సీ నిర్వాహకుడు మహేశ్వర్‌రావుకు ఎస్‌ఆర్‌కే వర్సిటీతో పాటు యూపీలోని గ్లోకల్‌ వర్సిటీతో కూడా నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారంతో సంబంధాలున్నాయని గుర్తించారు. లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదివిన ప్రతి విద్యార్థి రికార్డులు మావద్ద ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్సీటీల వివరాలను ఎప్పటికప్పుడు యూజీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తోందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని