Crime News: అమెరికా గంజాయి గుట్టురట్టు: పరుపుల మాటున హైదరాబాద్‌కు..

గంజాయి అక్రమ రవాణా ఎల్లలు దాటుతోంది. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయిన సరకును నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని ఓ కొరియర్‌ కార్యాలయంలో జరిపిన సోదాల్లో 1.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఉత్తరాంధ్రలో పండిన గంజాయి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. కానీ, అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని పట్టుకోవడం దేశంలో ఇదే

Updated : 22 Feb 2022 06:58 IST

దేశంలోనే తొలిసారిగా పట్టివేత!
ఇద్దర్ని అరెస్టు చేసిన ఎన్‌సీబీ

ఈనాడు, హైదరాబాద్‌: గంజాయి అక్రమ రవాణా ఎల్లలు దాటుతోంది. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయిన సరకును నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌ లక్డీకాపుల్‌లోని ఓ కొరియర్‌ కార్యాలయంలో జరిపిన సోదాల్లో 1.42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఉత్తరాంధ్రలో పండిన గంజాయి తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతుంటుంది. కానీ, అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని పట్టుకోవడం దేశంలో ఇదే తొలిసారి. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన లక్షయ్‌ జైన్‌, అమరేందర్‌లను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఎన్‌సీబీ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

కొరియర్‌ కార్యాలయంలో సోదాలు..

లక్షయ్‌, అమరేందర్‌లు అమెరికా నుంచి ఇటీవల పరుపులు దిగుమతి చేసుకున్నారు. అవి శుక్రవారం లక్డీకాపుల్‌లోని ఓ కొరియర్‌ కార్యాలయానికి చేరుకున్నాయి. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఎన్‌సీబీ అధికారులు శనివారం ఆ కొరియర్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. పరుపుల మధ్యలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ సంచిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అమెరికాలోని అధీకృత సంస్థలు తనిఖీ చేసి, ఆమోదించిన తర్వాతే ఈ పరుపులు హైదరాబాద్‌కు దిగుమతి అయినట్లు, పత్రాలన్నీ సరిగానే ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. నిందితులిద్దర్ని ప్రశ్నించగా.. తామే అమెరికా నుంచి గంజాయి దిగుమతి చేసుకున్నట్లు వారు అంగీకరించారు. తాము గత కొంతకాలంగా విదేశాల నుంచి వివిధ రకాల మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుంటున్నామని, వాటిని దేశంలోని వివిధ నగరాల్లో కళాశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా గంజాయిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సంస్కృతి ఇటీవల పెరిగిందని, గత ఏడాది బెంగళూరు ఎన్‌సీబీ అధికారులు గ్రీస్‌ నుంచి దిగుమతి చేసుకున్న కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. డార్క్‌ నెట్‌ ద్వారా వీటికి సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నాయని.. కేసు దర్యాప్తు కొనసాగుతోందని వారు పేర్కొన్నారు.

అమెరికా నుంచి ఎందుకు?

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు సర్వసాధారణం. ప్రస్తుతం తెలంగాణలో కాస్త తగ్గినా, ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున పండిస్తున్నారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి విషయం మొదటిసారి వెలుగులోకి వచ్చింది. గంజాయి నాణ్యతను అందులోని ‘ది సైకో యాక్టివ్‌ కాంపౌండ్‌’ (టీహెచ్‌సీ) ఆధారంగా నిర్ధారిస్తారు. టీహెచ్‌సీ ఎక్కువ ఉంటే హైగ్రేడ్‌ బడ్‌గా పిలుస్తారు. దీన్ని ప్రత్యేకంగా పండిస్తారు. మామూలు గంజాయి కంటే దీని సామర్థ్యం కనీసం పది రెట్లు ఎక్కువ ఉంటుందని, ధర కూడా అధికంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. సాధారణంగా గంజాయి నుంచి వాసన ఎక్కువగా వస్తుంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయి వాసన ఎక్కువగా ఉండదని,  అందుకే డిమాండ్‌ ఎక్కువగా ఉందని ఆ అధికారి వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు