Telangana News: పాలమూరులో అపహరణల అలజడి

మహబూబ్‌నగర్‌లో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం, అరెస్టు వ్యవహారం చిక్కుముడి వీడకముందే.. దిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు

Updated : 02 Mar 2022 07:30 IST

మహబూబ్‌నగర్‌లో ముగ్గురి అరెస్టుపై వీడని చిక్కుముడి

తాజాగా దిల్లీలో నలుగురి కిడ్నాప్‌

తమ వారిని వెంటనే విడిచిపెట్టాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్‌

ఈనాడు డిజిటల్‌-మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌లో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం, అరెస్టు వ్యవహారం చిక్కుముడి వీడకముందే.. దిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి, మరో ముగ్గురు కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. ఓ నేత అక్రమాలపై పోరాటం చేస్తున్న నేపథ్యంలోనే ఈ అదృశ్యం, అపహరణ ఘటనలు జరుగుతున్నాయని పాలమూరులో చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు గత బుధవారం, యాదయ్య, విశ్వనాథ్‌లు గురువారం అదృశ్యమయ్యారు. స్థానిక ఠాణాలో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాజకీయ కారణాలతో  వారి అదృశ్యం జరిగిందని ప్రచారం సాగింది. అయితే హైదర్‌ అలీ అనే వ్యక్తిపై ఆ ముగ్గురూ హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చూపి.. ఆదివారం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. తమవారిని అక్రమంగా అరెస్టు చేశారంటూ మంగళవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారి కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ఈ నెల 23న నా భర్తను ఎవరో కారులో తీసుకెళ్లారని ఫోన్‌ వచ్చింది. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా సీఐ సోమ్‌నారాయణ్‌ సింగ్‌ తొలుత ఫిర్యాదు తీసుకోలేదు. ‘నీ భర్త వస్తాడు.. రాజకీయాలు ఎందుక’ని అన్నారు. రెండు రోజుల తరవాత హైదరాబాద్‌ నుంచి పోలీసులు ఫోన్‌ చేసి.. నాగరాజును చర్లపల్లి జైలుకు పంపుతున్నట్లు సమాచారం అందించారు.

మరుసటి రోజు ఉదయం జైలుకు వెళ్తే.. సాయంత్రం వరకు ములాఖత్‌కు అవకాశమివ్వలేదు. తన అన్న అమరేందర్‌రాజు కూడా పోలీసుల అదుపులోనే ఉన్నాడని నా భర్త చెప్పారు’’ అని నాగరాజు భార్య గీత తెలిపారు. పండగ రోజు కూడా తాము రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చిందని యాదయ్య భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని ఆమె ఆరోపించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబసభ్యులు ఓ ప్రముఖ నేత పేరును ప్రస్తావించారు. ఆయన అక్రమాలపై పోరాటం చేస్తున్నందునే అరెస్టు చేశారని, మరికొందరూ అదృశ్యమయ్యారని, వారినీ పోలీసులే తీసుకెళ్లారని వారు ఆరోపించారు. ఓ నేత అక్రమాలపై తన భర్త గతంలో పోరాటం చేశారని, ఆ క్రమంలోనే ఆయన అపహరణకు గురైనట్లు అనుమానిస్తున్నట్లు మున్నూరు రవి భార్య గౌతమి ‘ఈనాడు’కు తెలిపారు. ఈ ఘటనలను కాంగ్రెస్‌, భాజపా నేతలు ఖండించారు. పచ్చని పాలమూరులో రాయలసీమ సంస్కృతిని తీసుకొస్తున్నారని పీసీసీ కార్యదర్శి ఎన్‌.పి.వెంకటేశ్‌ ఆరోపించారు. హైదర్‌ అలీపై హత్యాయత్నం చేసినట్లు అభియోగం మోపిన పోలీసులు అందుకు ఎలాంటి ఆధారాలు చూపడం లేదన్నారు. లాడ్జి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ చూడకుండానే కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. నాగరాజు అన్న అమరేందర్‌రాజు, మరో వ్యక్తి జాడ కూడా తెలియడం లేదన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో హైదర్‌ అలీ ఉన్న ఫొటోలున్నాయంటూ విలేకరులకు ఎన్‌.పి.వెంకటేశ్‌ చూపించారు.


దిల్లీలో మున్నూర్‌ రవి అపహరణ

ఇద్దరు సహచరులను, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌నూ తీసుకెళ్లిన ఆగంతుకులు

ఈనాడు, దిల్లీ: మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూర్‌ రవి దిల్లీలో అపహరణకు గురయ్యారు. మహబూబ్‌నగర్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. వాటిపై కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు సహచరులతో కలిసి రవి గత శనివారం దిల్లీకి వచ్చారు. సౌత్‌ అవెన్యూలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫ్లాట్‌లో ఉంటున్నారు. తన సెల్‌ఫోన్లు స్విచ్ఛాప్‌ చేసి.. జితేందర్‌రెడ్డి కారు డ్రైవర్‌ థాపా సెల్‌ఫోన్‌ వాడుతున్నారు. సోమవారం రాత్రి థాపా సెల్‌ఫోన్‌కు గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. తమకు జితేందర్‌రెడ్డి నివాసం దొరకడం లేదని చెప్పారు. వారికి జితేందర్‌రెడ్డి ఫ్లాట్‌ను థాపా చూపించాడు. ఏడెనిమిది మంది ఆగంతుకులు అందులోకి ఒక్కసారిగా చొరబడి రవిని, ఇద్దరు సహచరులను, థాపానూ బలవంతంగా కార్లలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. మంగళవారం జితేందర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాజు వచ్చిచూడగా థాపా, మున్నూర్‌ రవి, ఆయన సహచరులు లేకపోవడం.. దుస్తులు చిందరవందరగా ఉండడంతో వెంటనే సౌత్‌ అవెన్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌కు, రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో అపహరణ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఏడెనిమిది మంది వ్యక్తులు వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని