దుండగులు వచ్చింది బైక్‌పై.. డ్రైవింగ్‌ సీట్లో ఉన్నది శ్రీనివాసరెడ్డిగా భావించి కాల్పులు

ఇబ్రహీంపట్నం కర్ణంగూడ సమీపంలో మంగళవారం స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 8 బృందాలను ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ

Updated : 03 Mar 2022 06:47 IST

 బిహారీ సుపారీ ముఠాగా అనుమానం

కర్ణంగూడ ఘటనపై ముమ్మర దర్యాప్తు

ఈనాడు, హైదరాబాద్‌-ఆదిభట్ల, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం కర్ణంగూడ సమీపంలో మంగళవారం స్థిరాస్తి వ్యాపారులు శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డిపై కాల్పులు జరిపిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 8 బృందాలను ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ పర్యవేక్షిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసు అధికారులతోనూ మాట్లాడినట్టు సమాచారం. మంగళవారం ఉదయం 5 గంటల నుంచే శ్రీనివాసరెడ్డి కారును వారు అనుసరించారని ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘‘కర్ణంగూడలోని వెంచర్‌ బయట కారు నిలిపి శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి లోపలకు వెళ్లారు. తిరిగి వచ్చి రాఘవేంద్రరెడ్డి కారు స్టార్ట్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు డ్రైవింగ్‌ సీట్లో ఉన్నది శ్రీనివాసరెడ్డిగా భావించి కాల్పులు జరిపారు. పక్కసీట్లో ఉన్న శ్రీనివాసరెడ్డి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంటాడి అతి సమీపం నుంచి కాల్చారు. గాయపడిన రాఘవేంద్రరెడ్డి కారుతో పారిపోయే ప్రయత్నం చేశాడు. దుండగులు అతనిపై మరోమారు కాల్పులు జరిపి పారిపోయి ఉండవచ్చనేది అంచనా. దుండగులను షార్ప్‌ షూటర్స్‌గా, బిహారీ సుపారీ ముఠాగా భావిస్తున్నాం. వీరు కర్ణంగూడ రహదారి మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి నాగార్జున సాగర్‌వైపు వెళ్లారా? కర్ణంగూడ పోచారం, తిమ్మాపూర్‌, రాచులూరు దాటేసి శ్రీశైలం రహదారి చేరారా అనేది తేల్చేందుకు ఆయా మార్గాల్లోని సీసీ ఫుటేజ్‌ సేకరిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి సెల్‌ఫోన్ల డేటా ఆధారంగా వివరాలు సేకరించాం. హత్య జరిగిన రోజు శ్రీనివాసరెడ్డి మొబైల్‌కు వచ్చిన నంబరు బోర్‌వెల్‌ యజమానిదిగా గుర్తించాం. వివాదంలో ఉన్న భూమిలో మరో బోరు వేసే విషయమై వారు మాట్లాడుకున్నట్లు తెలిసింది. శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి ఇద్దరి వ్యక్తిగత నేరాలు, పాత గొడవల్లో నష్టపోయిన బాధితుల సమాచారం రాబడుతున్నాం. హంతకులు అల్మాస్‌గూడలో రెండ్రోజుల పాటు పాగా వేసినట్టు సమాచారం’’ అని ఆయన తెలిపారు.

పవన్‌, హఫీజ్‌లను ప్రశ్నించిన పోలీసులు

‘‘నగరం చుట్టుపక్కల భూముల లావాదేవీల్లో ఐదారేళ్లలోనే శ్రీనివాసరెడ్డి ఆస్తులు కూడబెట్టాడు. పవన్‌, హఫీజ్‌లను బినామీలుగా ఉంచాడు. గతేడాది కర్ణంగూడ వద్ద 20 ఎకరాలు కొనుగోలు చేశాడు. అ పక్కనే ఉన్న స్థలాన్ని ఆక్రమించాడనే వివాదంపై ఇరువర్గాలు గొడవ పడుతున్నాయి. అయితే జంట హత్యలకు కర్ణంగూడ భూవివాదంతో సంబంధం లేదని భావిస్తున్నాం’’ అని పోలీసు వర్గాలు తెలిపాయి. ‘‘గతంలో శ్రీనివాసరెడ్డి, రాఘవేంద్రరెడ్డి కలసి చేసిన భూవివాద పరిష్కారాలు, రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించాం. పవన్‌, హఫీజ్‌లను బుధవారం ప్రశ్నించాం. యజమాని తనను కొద్దిరోజులు పనిలోకి రావద్దని చెప్పారని శ్రీనివాసరెడ్డి డ్రైవర్‌ కృష్ణ చెప్పాడు. ఆదివారం రాత్రి షబ్‌ ఏ బరాత్‌లో జాగరణ చేయటంతో తాను వెళ్లలేదని సూపర్‌వైజర్‌ హఫీజ్‌ వివరించాడు’’ అని తెలిపాయి.

లేక్‌విల్లా అర్చాడ్స్‌పై చర్యలు: ఆర్డీవో

కర్ణంగూడ భూముల విషయంలో కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఆదేశాల మేరకు బుధవారం  ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్‌ అనిత విలేకర్లతో మాట్లాడారు. ఇబ్రహీంపట్నం ఖాల్సా పరిధిలో సర్వే నం.1369, 1370, 1371, 1372లోని ఈ భూముల విషయంలోనే హత్యలు జరిగినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తాము నమ్ముతున్నట్లు ఆర్డీవో తెలిపారు. అనుమతి లేకుండా ప్లాట్లు విక్రయించిన లేక్‌విల్లా అర్చాడ్స్‌ ప్రతినిధులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని