Updated : 13 Mar 2022 07:31 IST

Andhra News: అమ్మ చనిపోయిందని తెలియక.. పక్కనే 4రోజులుగా కుమారుడి జీవనం

మేనమామ రాకతో వెలుగుచూసిన ఘటన  

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: అమ్మ నాలుగు రోజులుగా లేవకపోతే నిద్రపోతోందని భావించాడా చిన్నారి... ఇంట్లో ఉన్న తినుబండారాలతో పాటు, తాను వండుకున్న ఆహారం తింటూ రోజూ బడికి వెళ్లొచ్చాడు... అమ్మ పక్కనే పడుకున్నాడు. సెల్‌ ఫోన్‌ ఎక్కువగా వాడకూడదయ్యా... అని అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి మూడు రోజులు ఫోన్‌ జోలికే వెళ్లలేదు. చివరికి ఇంట్లో వాసన వస్తోందంటూ మేనమామకు ఫోన్‌చేసి రమ్మన్నాడు. ఆయనొచ్చి అమ్మ చనిపోయిందని చెబితే కానీ అసలు విషయం తెలుసుకోలేని పరిస్థితి ఆ పిల్లాడిది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలంలో శనివారం వెలుగు చూసింది.  

తిరుపతి విద్యానగర్‌లోని బహుళ అంతస్తుల భవనంలో రాజ్యలక్ష్మి (41), తన పదేళ్ల కుమారుడు శ్యామ్‌కిశోర్‌తో కలిసి రెండేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. ఆమె ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకురాలు. కుమారుడు ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. భర్త శ్రీధర్‌రెడ్డి అధ్యాపకుడు. ఆయనతో భేదాభిప్రాయాలు రావడంతో రాజ్యలక్ష్మి వేరుగా జీవిస్తున్నారు. కొంతకాలంగా ఆమె తలనొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె పట్టా అందుకోవడానికి కర్ణాటక రాష్ట్రంలోని బెలగావికి బయలుదేరడానికి ఈ నెల 9న ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలోనే ఉంటున్న తన తమ్ముడు దుర్గాప్రసాద్‌తో ముందు రోజు మాట్లాడి విషయం చెప్పారు. అక్కడి నుంచి తిరిగొచ్చాక కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని, అప్పటికీ తలనొప్పి తగ్గకపోతే చికిత్స చేయించుకుంటానని ఆయనకు తెలిపారు. అదే రోజు రాత్రి రాజ్యలక్ష్మి మంచంపై నుంచి బోర్లాపడి అక్కడికక్కడే మృతి చెందారు. అమ్మ నిద్రపోతోందని కుమారుడు శ్యామ్‌కిశోర్‌ భావించాడు. ఆమెను నిద్ర లేపకూడదనుకున్నాడు. రెండు రోజులపాటు ఇంట్లో ఉన్న తినుబండారాలతో ఆకలి తీర్చుకున్నాడు. మూడోరోజు అన్నం, టమాటా కూర చేసుకున్నాడు. మూడు రోజులూ బడికి వెళ్లొచ్చాడు. అప్పటికీ రాజ్యలక్ష్మిని లేపలేదు. నాలుగోరోజు మేనమామకు ఫోన్‌చేసి ఇంట్లో దుర్వాసన వస్తోందని, నిద్రపోతున్న అమ్మకు ఆపరేషన్‌ చేయాలని చెప్పాడు. హుటాహుటిన ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ అసలు విషయం గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... పరీక్షల అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తన మేనల్లుడి మానసిక ఆరోగ్యం సరిగాలేదని దుర్గాప్రసాద్‌ చెప్పారు.

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని