రైల్వే, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలంటూ రూ. కోట్లు స్వాహా

రైల్వే, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులను మోసగించిన మాయగాళ్ల ముఠా బండారం బట్టబయలైంది. 8 మంది సభ్యులున్న ముఠాలో ఇద్దరు కీలక నిందితులు...

Updated : 15 Mar 2022 16:59 IST

ఇద్దరు నిందితుల అరెస్టు, రెండు కార్లు, నకిలీ పత్రాలు స్వాధీనం
ఈనాడు, హైదరాబాద్‌

రైల్వే, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులను మోసగించిన మాయగాళ్ల ముఠా బండారం బట్టబయలైంది. 8 మంది సభ్యులున్న ముఠాలో ఇద్దరు కీలక నిందితులు పొన్నాల భాస్కర్‌(57), కొండా రితేష్‌కుమార్‌(41)ను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రూ.9 లక్షలు, ఖరీదైన రెండు కార్లు, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో మోసగాళ్లు పట్టుబడ్డారు. సోమవారం నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ మీడియాకు నిందితుల వివరాలు వెల్లడించారు.  ముఠా నాయకుడు పొన్నాల భాస్కర్‌.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సోదరుడి కుమారుడు. వరంగల్‌ జిల్లా హన్మకొండ స్వస్థలం. కార్ఖానాలో ఉంటున్నాడు. హైదరాబాద్‌, దిల్లీ, చెన్నై, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నిరుద్యోగుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేశాడు. దిల్లీలోని ఠాగూర్‌ గార్డెన్‌, టాటాపూర్‌ నుంచి కార్యకలాపాలు చక్కదిదిద్దుతున్నాడు. దిల్లీ ఆర్‌ఆర్‌బీ ఉద్యోగులతో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకుని పథకం వేశాడు. సికింద్రాబాద్‌కు చెందిన కొండా రితేష్‌కుమార్‌, దిల్లీకి చెందిన అశోక్‌ సింఘాల్‌, ఏకె.సక్సేనా, దేవందర్‌ మిశ్రా, ముంబయి నివాసి భర్కత్‌ అలీ, గౌహతికి చెందిన దీపికా సిన్హా, ఈసీఐఎల్‌ నివాసి కాశిపల్లి రవీంద్రలతో కలిసి ముఠాకట్టి నకిలీ రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు నడిపించారు. రైల్వే/ఎఫ్‌సీఐ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీగా  దండుకోవటం ప్రారంభించాడు. మొత్తంమీద 16 మందిని మోసగించి, రూ.93.50 లక్షలు వసూలు చేసి పారిపోయాడు. 

భాస్కరుడి మాయలెన్నో 

ఆర్‌బీఐలో విదేశీయుల సొమ్ము పెద్దఎత్తున ఉందని, దాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం డబ్బు అవసరమంటూ స్నేహితులు, వ్యాపారుల నుంచి భాస్కర్‌ రూ.లక్షలు వసూలు చేశాడు. రైస్‌పుల్లింగ్‌, పంచలోహ విగ్రహాల క్రయవిక్రయాలతో రూ.కోట్లు కూడబెట్టవచ్చంటూ మాటలతో మభ్యపెట్టి వ్యాపారులను ముంచాడు. పదుల సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరిచి పెద్దమొత్తంలో రుణం తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. రుణ మంజూరుకు ఆర్‌బీఐ క్లియరెన్స్‌ కోసం రితేష్‌కుమార్‌, భర్కత్‌ అలీ బ్యాంకు ఖాతాల్లో రూ.52 లక్షలు, రూ.65 లక్షలు బదిలీ చేశాడు. పలు రాష్ట్రాల పోలీసులు భాస్కర్‌ కోసం గాలిస్తున్నారు. భాస్కర్‌ ముఠాను పట్టుకునేందుకు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సారథ్యంలో బృందం రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుని మరింత సమాచారం రాబట్టాలనుకుంటున్నారు.


దిల్లీలో నకిలీ ఆర్‌ఆర్‌బీ కేంద్రం

దిల్లీలో నకిలీ ఆర్‌ఆర్‌బీ ద్వారా దర్జాగా కార్యకలాపాలు నిర్వహించాడు భాస్కర్‌. యువకులకు పరీక్షలు నిర్వహించటం, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు, ఆఫర్‌ లెటర్లు, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు తయారుచేసి డబ్బు చేతిలో పడగానే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌, ఐడీకార్డు చేతికి ఇచ్చేవాడు. వెంటనే ఉద్యోగంలో చేరమని సూచించేవాడు. బాధితులకు చిక్కకుండా మొబైల్‌ఫోన్లు ఆపేసి మకాం దిల్లీకి మార్చాడు. బాధితులు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగానే ముంబయికి మకాం మార్చాడు. స్నేహితుల నివాసాలు, నక్షత్రాల హోటళ్లలో ఉంటూ విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ తప్పించుకుని తిరిగాడు. వారాంతాల్లో గోవా వెళ్లి క్యాసినో ఆడేవాడు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని