వెంటాడిన మృత్యువు.. ఏడు నెలల్లో మూడుసార్లు పాము కాటు

ఆమె చురుకైన విద్యార్థిని. కష్టపడి చదివి కుటుంబానికి చేదోడుగా నిలవాలని తపించింది. కానీ పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో  మూడుసార్లు పాముకాటుకు గురైంది.

Updated : 20 Mar 2022 07:06 IST

డిగ్రీ విద్యార్థిని కన్నుమూత

బేల, న్యూస్‌టుడే : ఆమె చురుకైన విద్యార్థిని. కష్టపడి చదివి కుటుంబానికి చేదోడుగా నిలవాలని తపించింది. కానీ పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో  మూడుసార్లు పాముకాటుకు గురైంది. రెండుసార్లు మృత్యువుతో పోరాడి గెలిచినా మూడోసారి విధిదే పైచేయి అయింది. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన రైతు భలేరావు సుభాష్‌ ఏకైక కుమార్తె ప్రణాళి (18). ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటేసింది. కుటుంబీకులు వైద్యం కోసం దాదాపు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొనిఉండగా పాముకాటుకు గురైంది. చికిత్సతో తిరిగి కోలుకుంది. అప్పటినుంచి తల్లిదండ్రులు ఆమెను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బయటకు ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా స్నేహితులపై చల్లుదామని తన కళాశాల బ్యాగ్‌లో ఉన్న రంగులను తీయబోతుండగా అందులోని  పాము ఒక్కసారిగా కాటు వేసింది. కుటుంబీకులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూసింది. ఒక్కగానొక కుమార్తె మృతితో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేసిందంటూ కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని