పాము కరిచి వసతి గృహం విద్యార్థి మృతి

వసతిగృహంలో చదువుకుంటున్న ఓ విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారం బీసీ సంక్షేమ వసతిగృహంలో జరిగింది. కీసర సీఐ రఘువీరరెడ్డి వివరాల ప్రకారం...

Updated : 22 Mar 2022 09:23 IST

కీసర, బాసర-న్యూస్‌టుడే: వసతిగృహంలో చదువుకుంటున్న ఓ విద్యార్థి పాము కాటుతో చనిపోయాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బోగారం బీసీ సంక్షేమ వసతిగృహంలో జరిగింది. కీసర సీఐ రఘువీరరెడ్డి వివరాల ప్రకారం... వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం కొమిశెట్టిపల్లికి చెందిన జి.రమేశ్‌ కుమారుడు జి.శివశంకర్‌(13) బోగారం వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సాయంత్రం స్టడీ అవర్‌లో తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహం ప్రాంగణంలో మెట్లపై కూర్చొని చదువుకుంటున్నాడు. మెట్ల పక్కనున్న రంధ్రంలోంచి పాము వచ్చి.. ఎడమ చేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య కాటు వేసింది. శివశంకర్‌ వెంటనే తనను ఏదో పురుగు కరిచిందని వసతి గృహంలోని హెల్త్‌ అసిస్టెంట్‌కు చూపాడు. ఆయన ప్రథమ చికిత్స చేసి ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థికి సెలైన్‌ ఎక్కించే ప్రయత్నం చేశారు. అతని నోటి నుంచి నురగలు వచ్చి పరిస్థితి విషమంగా మారడంతో మేడిపల్లిలోని కాకతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా శివశంకర్‌ మృతి చెందాడు. వసతి గృహంలో ఉండి చక్కగా చదువుకుంటాడనుకుంటే.. తమ కుమారుడు పాము కాటుతో చనిపోయాడంటూ శివశంకర్‌ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థికి పాము కాటు

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో జరిగిన మరో ఘటనలో ప్రదీప్‌ అనే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. ఆదివారం రాత్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రదీప్‌ వైద్యం కోసం వసతిగృహంలోని డిస్పెన్సరీకి వెళుతుండగా పాము కాటువేసింది. వెంటనే డిస్పెన్సరీ వైద్యులు యాంటీ వీనమ్‌ మందును ఇచ్చి నిజామాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని