Crime News: ఫేక్‌ సర్టిఫికెట్లతో 30 ఏళ్లపాటు ఉద్యోగం.. దొరికేశాడు!

ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 ఏళ్లకు పైగా కస్టమ్స్‌ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశాడు. అలా అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయికి ఎదిగిన ఆయన విద్యార్హత 

Updated : 25 Mar 2022 07:32 IST

కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌పై సీబీఐ కేసు

2015లోనే ఫిర్యాదు... ఇన్నేళ్లకు కదలిక

ఈనాడు, హైదరాబాద్‌: ఆయన నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం సంపాదించాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 30 ఏళ్లకు పైగా కస్టమ్స్‌ విభాగంలో వివిధ హోదాల్లో పనిచేశాడు. అలా అసిస్టెంట్‌ కమిషనర్‌ స్థాయికి ఎదిగిన ఆయన విద్యార్హత పత్రాలన్నీ నకిలీవేనని 2015లో ఫిర్యాదు వచ్చింది. కానీ దానిపై చర్యలు తీసుకోవడానికి సుమారు ఏడేళ్లు పట్టింది. ఆరోపణలు నిజమేనని తేలడంతో అతడిపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లోని జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయంలో కస్టమ్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న సంజయ్‌ శాంతారాం పాటిల్‌ బండారం ఎట్టకేలకు బయటపడింది. అతడు ముంబయి కస్టమ్స్‌ విభాగంలో 1990 డిసెంబరు 21వ తేదీన కస్టమ్స్‌ ప్రివెన్షన్‌ అధికారిగా ఉద్యోగంలో చేరాడు.

సంజయ్‌ పాటిల్‌ డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవని సంజయ్‌ జాదవ్‌ అనే వ్యక్తి 2015 జులై 17న ముంబయిలోని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (కస్టమ్స్‌) కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుగుతుండగానే 2017లో సంజయ్‌పాటిల్‌కు అసిస్టెంట్‌ కమిషనర్‌గా పదోన్నతి ఇచ్చి, హైదరాబాద్‌కు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా పాటిల్‌ సమర్పించిన పత్రాలను కస్టమ్స్‌ విజిలెన్స్‌ విభాగం అధికారులు పరిశీలించారు. రాంచీ విశ్వవిద్యాలయం జారీ చేసినట్లు చెబుతున్న డిగ్రీ విద్యార్హత పత్రంతోపాటు ప్రొవిజనల్‌, మైగ్రేషన్‌ ధ్రువపత్రాలు, మార్కుల జాబితా, చివరకు హాల్‌టిక్కెట్‌ కూడా నకిలీవేనని తేలింది. దాంతో 2019 ఏప్రిల్‌ 26న ఉన్నతాధికారులు సంజయ్‌పాటిల్‌ను సస్పెండ్‌ చేశారు. అతడిపై తదుపరి చర్యల కోసం హైదరాబాద్‌ జీఎస్టీ అండ్‌ కస్టమ్స్‌ చీఫ్‌ కమిషనర్‌ కార్యాలయానికి చెందిన అదనపు కమిషనర్‌ కె.జి.వి.ఎన్‌.సూర్యతేజ 2021 నవంబరు 12న హైదరాబాద్‌ సీబీఐ విభాగానికి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలోనూ పాటిల్‌ ధ్రువపత్రాలన్నీ నకిలీవేనని తేలడంతో బుధవారం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని