Crime News: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని తల్లినే చంపేశాడు

వారిదో నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితి. కుటుంబ పెద్దకు అనారోగ్యం. దాంతో ఇంటి ఇల్లాలే కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు క్షణికావేశంలో

Updated : 26 Mar 2022 07:18 IST

రోకలిబండతో దాడి చేసిన కుమారుడు

ఉండవల్లి, న్యూస్‌టుడే: వారిదో నిరుపేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితి. కుటుంబ పెద్దకు అనారోగ్యం. దాంతో ఇంటి ఇల్లాలే కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. కుమారుడు క్షణికావేశంలో చేసిన పనికి అతడి శరీరం కాలిపోతే, అతడికి సపర్యలు చేయడానికి ఆ తల్లి కూలికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉండిపోయింది. ఈలోగా తనకు స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలన్న కుమారుడి మంకుపట్టు గొడవకు దారితీసింది. కోపంతో ఆ కుర్రాడు తల్లి తల పగలగొట్టడంతో ఆమె మృతి చెందింది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం శేరిపల్లి గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై జగన్‌మోహన్‌ కథనం ప్రకారం.. శేరిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి (52), వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు. లక్ష్మి వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషిస్తోంది. పెద్ద కుమారుడు మహేశ్‌ ఇంటర్‌ పూర్తి చేసి కూలి పనులకు వెళ్తుండేవాడు. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వాలని తల్లితో నిత్యం గొడవపడుతున్నాడు. డబ్బులు లేవని తల్లి మందలిస్తూ వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఫోన్‌ కోసం మహేశ్‌ మరోసారి తల్లితో గొడవపడ్డాడు. ఆవేశంలో రోకలిబండతో తల్లి తలపై కొట్టడంతో ఆమె తీవ్రగాయాలై కిందపడిపోయింది. 108 అంబులెన్సు సిబ్బంది వచ్చేసరికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మి అక్క దేవమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఇటీవల లక్ష్మి మరో కుమారుడు సాల్‌మన్‌ కారు అద్దాలు పగులగొట్టి ఇద్దరిని గాయపరిచిన కేసులో జైలుకు వెళ్లాడని గ్రామస్థులు చెప్పారు. దీంతో మహేశ్‌ క్షణికావేశానికి లోనై మూడు రోజుల కిందట రైతులు పొలాల్లో మిరప కట్టెకు నిప్పు పెట్టిన సమయంలో అందులోకి దూకడంతో చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. కుమారుడి గాయాలకు మందు పూసేందుకే లక్ష్మి కూలి పనులకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉందని.. అతడి చేతిలోనే హతమైందని చుట్టుపక్కలవారు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని