కలసిరాని స్థిరాస్తి వ్యాపారం.. ఆర్థిక ఇబ్బందులతో అన్నదమ్ముల బలవన్మరణం

కరోనా సమయంలో స్థిరాస్తి వ్యాపారం కలసిరాక.. అందుకోసం చేసిన అప్పులు తీర్చలేక సోదరులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే గదిలో చెరో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన సోమవారం నల్గొండలో చోటు చేసుకుంది.

Updated : 12 Apr 2022 07:35 IST

నల్గొండ  నేరవిభాగం, న్యూస్‌టుడే: కరోనా సమయంలో స్థిరాస్తి వ్యాపారం కలసిరాక.. అందుకోసం చేసిన అప్పులు తీర్చలేక సోదరులిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే గదిలో చెరో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ దారుణ ఘటన సోమవారం నల్గొండలో చోటు చేసుకుంది. స్థానికులు, టూటౌన్‌ ఎస్సై రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పెద్దసూరారానికి చెందిన మార్తా శ్రీకాంత్‌(42), వెంకన్న(39) కుటుంబాలతో పాటు నల్గొండ శ్రీనగర్‌కాలనీలో అద్దె ఇంటిలో ఉంటున్నారు. శ్రీకాంత్‌ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగి. సోదరుడు వెంకన్నతో కలసి ఆయన కొన్నేళ్లుగా నల్గొండ, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం ఇద్దరూ కలిసి రూ.3 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. కరోనా దెబ్బతో ఆ మొత్తం సకాలంలో తిరిగిరాక, తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరిగి నష్టపోయారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో మనస్తాపానికి గురయ్యారు. సోమవారం కుటుంబ సభ్యులు పెద్దసూరారం వెళ్లడంతో సోదరులిద్దరూ మధ్యాహ్నం ఇంటిలో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్‌చేసినా ఎత్తకపోవడంతో రాత్రి 8గంటల సమయంలో ఇంటికి తిరిగొచ్చి తలుపులు తెరవగా సోదరులిద్దరూ విగతజీవులై కనిపించారు. చనిపోయే ముందు రాసిన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ‘మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్లు ఇవ్వటం లేదు.. అప్పులోళ్లు అసలు ఆగటం లేదు.. ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం.. అందరికీ సాయం చేసిన మేం మీకు ఏమీ చేయకుండానే వెళ్లిపోతున్నాం.. కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని రాసివుంది. అన్నదమ్ములిద్దరూ  కలిసే కన్నుమూయటంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు ఆపటం ఎవరి తరం కాలేదు. మృతులిద్దరికీ చెరో కుమార్తె, కుమారుడున్నారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని